దివ్యా.. నీ వెంటే నేను | - | Sakshi
Sakshi News home page

దివ్యా.. నీ వెంటే నేను

Mar 22 2026 7:22 AM | Updated on Mar 22 2026 7:22 AM

ఇల్లందకుంట: అతనో ఎస్సై.. అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితం. ఈ నెల 17న కడుపునొప్పి బాధ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. తట్టుకోలేని ఎస్సై సైతం నీవెంటే నేనంటూ.. శనివారం అత్తగారింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు అనాథలు కాగా.. ఈ ఘటనతో కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన దేసు చంద్రశేఖర్‌(36) ప్రస్తుతం కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన దివ్య(30)తో 2016లో వివాహమైంది. నగరంలోని హనుమాన్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శుభమన్యు(4) అశ్వద్ధామ(7) ఉన్నారు.

దివ్య ఆత్మహత్యతో...

అన్యోన్యంగా సాగుతున్న వారి జీవన ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దివ్య కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 17వ తేదీన గన్నేరుపువ్వు, ఆకు పసరు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివ్య పుట్టినిల్లు అయిన ఇల్లదంకుంట మండలం సీతంపేటకు తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియల సమయంలో దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణం అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో దాడికి ప్రయత్నించారు. దివ్య తండ్రి చంద్రశేఖర్‌ను ఓ గదిలో ఉంచి తాళం వేసి, అంత్యక్రియలు పూర్తిచేశారు.

బట్టలు మార్చుకుంటానని వెళ్లి..

భార్య మృతితో చంద్రశేఖర్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. మూడో రోజు కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. శనివా రం ఐదవ రోజు కార్యక్రమం జరిగింది. శ్మశాన వాటిక వద్ద కార్యక్రమం పూర్తిచేసుకుని అంతా ఇంటికొచ్చారు. బట్టలు మార్చుకుంటానని గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్‌ గడియపెట్టుకుని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. గదిలోంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకుని కనిపించాడు. వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటన సమయంలో చంద్రశేఖర్‌ తల్లిదండ్రులు, తమ్ముడూ అక్కడే ఉన్నారు.

అనాథలైన పిల్లలు

భార్య, ఇద్దరు పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగం.. సాఫీగా సాగిపోతున్న జీవితంలో చీకట్లు కమ్ముకోవడంతో చంద్రశేఖర్‌ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణంగా ప్రేమించే భార్య మృతి చెందడంతో మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలుస్తోంది. తల్లి మరణాన్ని మరవక ముందే ఐదు రోజుల వ్యవధిలో తండ్రి కూడా దూరమవడంతో పదేళ్లలోపు పిల్లలిద్దరూ ‘మమ్మీ,డాడీ’ అంటూ రోదించడం అక్కడివారిని కన్నీరు పెట్టించింది. చంద్రశేఖర్‌ తమ్ముడు కార్తీక్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మాధవి వివరించారు.

భార్య మృతిని తట్టుకోలేక కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై ఆత్మహత్య

ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న భార్య దివ్య

ఐదు రోజుల వ్యవధిలో దంపతుల మృతి

అనాథలైన ఇద్దరు చిన్నారులు

సీతంపేటలో విషాదం

అదే నా చివరి కోరిక అంటూ..

చంద్రశేఖర్‌ చనిపోవడానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ.. ‘నేను ఒకవేళ చనిపోతే.. నా భార్య పక్కనే నా అంత్యక్రియలు చేయండి’ అంటూ చెప్పాడు. కాసేపటికే ఆత్మహత్య చేసుకోవడంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సీతంపేటకు తీసుకొచ్చారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించి, దివ్య అంత్యక్రియలు చేసిన చోటే చంద్రశేఖర్‌ మృతదేహాన్ని ఖననం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement