వేతనం.. సతమతం | - | Sakshi
Sakshi News home page

వేతనం.. సతమతం

Dec 18 2025 7:23 AM | Updated on Dec 18 2025 7:23 AM

వేతనం.. సతమతం

వేతనం.. సతమతం

కరీంనగర్‌ అర్బన్‌: ఒక నెల వేతనం రాకుంటే అల్లాడే కుటుంబాలు ఎన్నో. అలాంటిది 2 నెలలుగా వేతనాల్లేక పడిగాపులు కాస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఓవైపు పిల్లల స్కూలు ఫీజులు.. మరోవైపు నిత్యావసరాలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అవసరాలు తీర్చుకుంటుండగా.. వడ్డీ తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. సాంకేతిక కారణాలను బూచిగా చూపుతూ ప్రభుత్వం వేతనాలను మంజూరు చేయడకపోవడం ఆందోళనకర పరిణామం. జీతాలపై అధికారులను అడిగినా సరైన స్పందన లేకపోవడంతో ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండేళ్లుగా మూడు నెలలు, నాలుగు నెలలకోసారి వేతనమిస్తూ ఉద్యోగులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు.

ఆపరేటర్‌ నుంచి ఏపీవో వరకు..

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఏపీవో, ఈసీ(ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌), టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లను ప్రభుత్వం అప్పట్లో నియమించుకుంది. జిల్లాలో ఏపీవోలు 15, ఆరుగురు ఈసీలు, 38 మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు, 274 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు, 20 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లున్నారు. జిల్లాలో మొత్తంగా 350 మంది ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే రెండు నెలల నుంచి జీతం రావడం లేదు. వేతనాలకు సంబంధించి స్పర్స్‌ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపాల కారణంగా రావడం లేదని తెలుస్తోంది. వేతనాలు రాకున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.కోటి పైనే..

ఉపాధిహామీలో పని చేసే కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ.18,000 నుంచి రూ.20వేలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.11,500, టెక్నికల్‌ అసిస్టెంట్లకు రూ.25వేల నుంచి రూ.30వేలు, ఈసీలు, ఏపీవోలకు రూ.50వేల వరకు వేతనాలిస్తున్నారు. వీరికి నెలకు సుమారు రూ.50.25లక్షల చొప్పున 2 నెలలకు గాను రూ.1.05కోట్లు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.

తగ్గని టార్గెట్లు..

వేతనాలు పెండింగ్‌లో ఉన్నా.. విధుల్లో మాత్రం తేడా రావొద్దంటూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు విధిస్తున్న టార్గెట్‌ ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీవోలను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లదే కీలకపాత్ర. గ్రామాల్లో ఉపాధిహామీ కింద పనులు చేయించడం ఫీల్డ్‌ అసిస్టెంట్ల బాధ్యత కాగా.. చేపట్టిన పనులను క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు వేయాల్సిన బాధ్యత టెక్నికల్‌ అసిసెంట్లపై ఉంటుంది. కొలతలకు సంబంధించి ఎంబీ రికార్డులు తయారు చేసి ఆన్‌లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత టీఏలపై ఉంటుంది. టెక్నికల్‌ అసిస్టెంట్లు వేసిన కొలతల ఆధారంగానే కూలీలకు వేతనాలు వస్తాయి. పని తక్కువ చేసిన కూలీకి తక్కువ, పని ఎక్కువ చేసిన కూలీకి ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. కూలీలకు రూ.300 వేతనం కచ్చితంగా రావాలన్న అధికారుల ఆదేశాలు టీఏలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన తండాలు, పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో ఆ పని భారం టీఏలపై పడుతోంది. ఒక్కో గ్రామంలో కనీసం పది ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే సమయం సరిపోని పరిస్థితి.

2 నెలలుగా అందని వైనం

ఆందోళనలో ‘ఉపాధి’ ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement