ఉద్యాన రైతుకు చేయూత
జిల్లాకు మంజూరైన యంత్ర పరికరాలు
కరీంనగర్‌రూరల్: వ్యవసాయానికి అనుబంధంగా ఉద్యాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆధునిక పద్ధతులు, ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యాన పంటలను రైతులు సాగు చేసేందుకు వీలుగా యాంత్రీకరణకు ప్రాధాన్యమిస్తోంది. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లాకు 86 యూనిట్లు మంజూరు చేసింది.
దశాబ్దం తర్వాత..
గతంలో వ్యవసాయంతోపాటు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పంపిణీ చేస్తున్నారనే సాకుతో సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేశారు. దీంతో పలువురు రైతులు ప్రైవేట్‌గా పరికరాలను కొనుగోలు చేయడంతో ఆర్థికంగా భారం పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాకు 86 యూనిట్లు మంజూరు కాగా.. అర్హులైన రైతుల నుంచి ఉద్యాన శాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 49 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. యంత్ర పరికరాలకు సంబంధించి ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలను చేసుకుంది. పరికరాల కొనుగోలుపై 5 ఎకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు 40 శాతం సబ్సిడీని అందిస్తారు.
ప్రభుత్వం సబ్సిడీపై ఉద్యాన రైతులకు యంత్ర పరికరాలను అందిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ నిధులను మంజూరు చేసింది. పరికరాలు అవసరమున్న రైతులు దరఖాస్తు చేసుకోవాలి.
– అయిలయ్య, ఉద్యాన శాఖ అధికారి,
ఉమ్మడి కరీంనగర్ మండలం
పవర్ వీడర్లు: 18, బ్రష్ కట్టర్లు: 29
పవర్ స్ప్రేయర్లు: 27, పవర్ టిల్లర్లు: 9
మినీ ట్రాక్టర్లు: 3


