కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విజయ్‌నగర్‌లో నివాసముంటూ మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఆవుల రమేశ్(50) బుధవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు వన్‌టౌన్ ఏఎస్సై వెంకటేశ్వరబాబు తెలిపారు. ఏడాదిన్నర క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోగా, తల్లితో కలిసి నివాసముంటున్నాడు. భార్య కాపురానికి రావడంలేదని తాగుడుకు బానిసై జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు ఏఎస్సై వివరించారు. మృతుడి తల్లి ఆవుల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. విద్యార్థి మృతితో రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుర్రం శరత్‌రెడ్డి(20) కరీంనగర్‌లో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. కరీంనగర్‌లోని తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు రేపాక నుంచి సోమవారం బైక్‌పై మరో ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాడు. కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ వద్ద రాజీవ్ రహదారిపై స్కూటీ ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శరత్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఎల్‌ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపుతప్పి ఒకరి దుర్మరణం
● మరొకరి పరిస్థితి విషమం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని వారసంత సమీపంలో బుధవారం రాత్రి బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా పెద్దతూండ్ల గ్రామానికి చెందిన పింగిలి బబ్బులు(25)తీవ్రగాయాలతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఒజ్జం వినయ్(22) తీవ్రంగా గాయపడగా.. కరీనంగర్ తరలించారన్నారు. వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. బైక్ అదుపుతప్పి మోరీ గోడకు ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య


