ఎన్నికలు తెచ్చిన పంచాయితీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలోని ఓ వర్గంలో పంచాయతీ ఎన్నికలు కొత్త పంచాయితీని తెచ్చి పెట్టాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో ఇటీవల రెండో దశ స్థానిక ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. కాగా ఓ వర్గానికి సంబంధించిన అభ్యర్థి సర్పంచ్ బరిలో పోటీచేయగా ఆవర్గం వారు సదరు అభ్యర్థికే ఓటేయాలని తీర్మానించారు. సుమారు 500 ఓట్లు ఉన్న ఆ వర్గం వారి ఓట్లలో 150 వేరే అభ్యర్థికి పోల్ కావడంతో అతడు విజయం సాధించాడాని తేల్చారు. దీంతో బుధవారం గ్రామంలోని ఆలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. తమ అభ్యర్థి రూ.లక్షలు ఖర్చుచేసి పోటీలో ఉంటే ఓట్లు వేరే వారికి ఎలా వేస్తారని చర్చించుకున్నారు. ఓ మహిళ దీనంతటికి కారణమని గుర్తించి ఆమెను కూడా నిలదీశారు. ప్రశాంతంగా ఉండే పచ్చని పల్లెలో ఎన్నికలు చిచ్చు రేపాయాని గ్రామస్తులు చర్చించుకుంటున్నా రు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


