పస్తులతో పాఠాలు
జిల్లాలో..
● అర్ధాకలితో పదోతరగతి విద్యార్థులు ● ప్రత్యేక తరగతులకు స్నాక్స్ అందక ఇబ్బందులు ● జిల్లాలో 3,411 మంది ‘పది’ విద్యార్థులు
ముస్తాబాద్(సిరిసిల్ల): పదో తరగతి విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. బాగా చదువుకోవా లన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆశయం అర్ధాకలి మధ్య సాగుతోంది. సాయంత్రం అల్పాహారం అందక నీరసించి పాఠాలు సరిగా వినలేకపోతున్నారు. పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అల్పాహారం అందించేందుకు గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో 3,411 మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి సాయంత్రం వేళ స్నాక్స్ అందించాల్సి ఉంది. సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు నిత్యం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం చేసిన విద్యార్థులు సాయంత్రం వరకు ఆకలితో అల్లాడుతున్నారు.
నెలరోజుల క్రితమే ప్రారంభించాల్సింది..
నవంబర్ 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ, నెల రోజులుగా విద్యార్థులకు ఎలాంటి అల్పాహారం అందించడం లేదు. గోరుముద్ద పథకం జాడ లేకపోవడంతో విద్యార్థులు సరిగా తరగతులు వినలేకపోతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ప్రభుత్వ ఆశయం ఏ మేరకు నెరవేరుతుందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రోజూ సాయంత్రం స్నాక్స్‌లో ఉడకబెట్టిన పల్లీలు, బబ్బెర్లు, శనగలు, మెత్తటి అటుకులు ఇస్తారు.
పొరుగూరి విద్యార్థులకు ఇబ్బంది
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్న గ్రామాల విద్యార్థులు పదో తరగతి కోసం సమీప గ్రామాల్లోని హైస్కూళ్లకు వస్తున్నారు. వీరంతా ఉదయమే పాఠశాలకు వచ్చి, ఇక్కడే మధ్యాహ్న భో జనం చేస్తారు. ప్రత్యేక తరగతుల తర్వాత పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటున్నారు. ఆకలితోనే ఇళ్లకు చేరుతున్న విద్యార్థులు నీరసించిపోతున్నారు.
జెడ్పీ హైస్కూళ్లు 109
ఎంపీహెచ్‌ఎస్ స్కూళ్లు 03
ప్రభుత్వ హైస్కూల్స్ 02
పదో తరగతి విద్యార్థులు 3,411
‘ఈ ఫొటోలోని విద్యార్థినులు బత్తుల సంజన, నిమ్మల వైష్ణవి. వీరిది ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది. వారి ఊరిలో ఏడో తరగతి వరకు మాత్రమే ఉండడంతో ముస్తాబాద్‌లోని హైస్కూల్‌కు వస్తున్నారు. పదో తరగతి చదువుతున్న వీరికి ప్రత్యేక తరగతులు సాయంత్రం 5.30 వరకు సాగుతున్నాయి. ఇంటికెళ్లే సరికి రాత్రి 7.30 గంటలు అవుతోంది. మధ్యాహ్నం స్కూల్‌లో చేసిన భోజనంతో రాత్రి వరకు ఆకలితో ఉంటున్నామని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో క్లాసులను సరిగా వినలేకపోతున్నామంటున్నారు. ఇలా వీరుమాత్రమే కాదు.. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు అందరూ ఎదుర్కొంటున్నారు’.
పస్తులతో పాఠాలు


