
మద్దతు ధర అందించడమే లక్ష్యం
ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలి గన్నీసంచులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నాయి కలెక్టర్ ఎం.హరిత
సిరిసిల్ల: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడమే లక్ష్యమని కలెక్టర్ ఎం.హరిత స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ 2025–26 ధాన్యం సేకరణపై పౌరసరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ, రవాణా, మార్కెటింగ్, సహకార, ఐకేపీ, మెప్మా అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. గత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఈ సీజన్లో సుమారు 2.70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా ఉన్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ, రవాణా, లారీలు ఇతర ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం 17 ఉండేలా చూసుకొని కేంద్రాలకు తరలించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం గ్రేడ్–ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2389, కామన్ రకానికి రూ.2,369 నిర్ణయించిందని తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 అదనంగా ఇస్తుందని తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 144, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 79, మెప్మా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కలిపి మొత్తం 231 కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. టార్పాలిన్లు 7,592, తూకం వేసే యంత్రాలు 764, ప్యాడీ క్లీనర్లు 731, తేమశాతం చూసే మెషిన్లు 603, గ్రైన్ కాలిపర్స్ 270 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీసీఎస్‌వో చంద్రప్రకాశ్, జిల్లా మేనేజర్ రజిత, డీఏవో అఫ్జల్‌బేగం, డీఆర్డీవో శేషాద్రి, డీసీవో రామకృష్ణ, డీఎంవో ప్రకాశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధం
సిరిసిల్ల/వేములవాడఅర్బన్/బోయినపల్లి/చందుర్తి/రుద్రంగి: జిల్లాలో స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరిత పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, బోయినపల్లి, చందుర్తి మండల పరిషత్‌లలో, రుద్రంగి గ్రామపంచాయతీలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేసిన హెల్ప్‌డెస్క్‌లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే ఆర్‌వో, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయని వివరించారు. ఎన్నికకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో పెట్టాలని అధికారులకు సూచించారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, ఎంపీడీవోలు రాజీవ్‌మల్హోత్ర, జయశీల, రాధ, నటరాజ్, తహసీల్దార్‌లు విజయప్రకాశ్‌రావు, నారాయణరెడ్డి, భూపతి, పుష్పలత, ఎంపీవో బండి ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్యసేవలపై అవగాహన కల్పించాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. బోయినపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు వివరాలు, రిజిస్టర్, ఫార్మసీలను పరిశీలించారు. వైద్యులు కార్తీక్, పీహెచ్‌సీ వైద్యసిబ్బంది ఉన్నారు.