
‘సెస్’ పాలకవర్గంలో చీలిక
అధికారుల సాక్షిగా చైర్మన్‌పై అవిశ్వాసం ప్రతిపాదన ఉద్యోగుల విధులకు జీపీఎస్ విధానం చైర్మన్ తీరుపై అధికారుల గుస్సా డైరెక్టర్లతో కలిసి పావులు కదుపుతున్న వైనం
సిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పాలకవర్గంలో చీలికొచ్చింది. 2022 డిసెంబరు 27న కొలువుదీరిన పాలకవర్గం రెండున్నర ఏళ్లుగా ఏకతాటిపై ముందుకుసాగింది. నాలుగు నెలలుగా పాలకవర్గం చీలిపోయింది. ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామరావును పదవి నుంచి తొలగించాలని మెజార్టీ డైరెక్టర్లు భావిస్తున్నారు. ముందుస్తుగా సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుతో ఎల్లారెడ్డిపేట డైరెక్టర్ వరుస కృష్ణహరి, కోనరావుపేట డైరెక్టర్, ‘సెస్’ వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, ముస్తాబాద్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి కలిశారు. సెస్ చైర్మన్ ఒంటెద్దు పోకడలతో మెజార్టీ డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. ఈమేరకు చిక్కాల రామారావుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని కేటీఆర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
పార్టీ మారిన డైరెక్టర్లు !
2022 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 15 ‘సెస్’ డైరెక్టర్ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా గెలి చిన వేములవాడ టౌన్–1 డైరెక్టర్ నామాల ఉమ, బోయినపల్లి డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ‘సెస్’ చైర్మన్ చిక్కా ల రామారావుపై అవిశ్వాసం పెట్టకుండా.. బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటే.. ఆ పార్టీని వీడేందుకు కొందరు డైరెక్టర్లు సిద్ధమైనట్లు తెలిసింది. ఈమేరకు కాంగ్రెస్ నేతలతో కొందరు డైరెక్టర్లు టచ్‌లో ఉన్నా రు. మొత్తంగా డిసెంబరులో చిక్కాల రామారావుపై అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది.
‘సెస్’ అధికారుల తోడ్పాటు
‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు ఇటీవల 57 మంది పర్మినెంట్ ఉద్యోగులు విధిగా జీపీఎస్ విధానంలో హాజరు ఉండాలని, విధులు నిర్వహించే ప్రదేశం నుంచి ఫేస్(ముఖచిత్రం) నమోదు చేయాలని ఆదేశిస్తూ మెమో జారీ చేశారు. ఈమేరకు ఎస్‌ఏ, ఏఏవో, జేఏవో, ఏఏఈ, ఎల్‌ఐ, ఏడీఈ ఉద్యోగులు విధిగా జీపీఎస్ విధానంలో హాజరుకావాలి. అలా హాజరు నమోదు చేయకుంటే జీతాల్లో కోతలు తప్పవని స్పష్టం చేశారు. అక్టోబరు నుంచే ఈ విధానం అమలులోకి తెస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.‘సెస్’ క్షేత్రస్థాయి ఉద్యోగులు ఎక్కడికి వెళ్తున్నారు.. ఏం పనిపై వెళ్తున్నారో ముందస్తుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో లాగే.. ‘సెస్’ పరిధిలోనూ అమలు చేస్తున్నామని చిక్కాల రామారావు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రమోషన్లు కావాలని కొందరు ఉద్యోగులు కోరగా.. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగా లేదని తరువాత చూద్దామని వాయిదా వేయడంతో ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి కారణాలతో ‘సెస్’ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు కొందరు చైర్మన్ తీరుపై ఆగ్రహంతో అవిశ్వాసానికి తెరలేపారని భావిస్తున్నారు.
ఎర్తింగ్ పైపుల కొను‘గోల్‌మాల్’
‘సెస్’ పరిధిలో విద్యుత్ స్తంభాలకు ఎర్తింగ్ పైపుల ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ పర్ఛేజ్ ఆర్డర్ ప్రకారం అవసరం లేకున్నా 2,500 పైపుల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చారు. ఒక్కో పైపు ధర రూ.1,600 ఉండగా.. రూ.2,300లుగా నిర్ణయించి కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే 1,258 కొనుగోలు చేసి రూ.8.80 లక్షల మేరకు అదనంగా నొక్కేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బయటపెట్టారనే డీఈఈగా పనిచేసిన శ్రీధర్‌రావును సరెండర్ చేసినట్లు తెలిసింది. ఇటీవల రూ.50లక్షల మెటీరియల్ కొనుగోలుకు టెండర్లు పిలిచి రూ.32లక్షల మేరకు మెటీరియల్ కొనుగోలు చేశారు. ఇందులోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అవిశ్వాసం పేరుతో వసూళ్లపర్వం
మెజార్టీ ‘సెస్’ డైరెక్టర్ల అలక.. ఉద్యోగుల అసంతృప్తి నేపథ్యంలో అవిశ్వాసం పేరిట ఆయనపై ఒత్తిడి పెంచి జీపీఎస్ విధానం రద్దు చేయించుకోవాలని ఉద్యోగులు భావిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రామారావు వద్ద కొందరు డైరెక్టర్లు డబ్బులు దండుకోవాలని ఈ అవిశ్వాస ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు.