
ఇలాగైతే ఆడేదెలా?
జిల్లాలో పీడీలు కరువు విద్యార్థులకు అందని క్రీడాశిక్షణ క్రీడాసామగ్రికి నిధులు.. శిక్షకులు కరువు జిల్లాలో 10 జూనియర్, రెండు డిగ్రీ కళాశాలలు ఆటలకు దూరంగా విద్యార్థులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మానసిక, శారీరక వికాసం సాధించేందుకు క్రీడలు దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో క్రీడలపై శ్రద్ధ చూపుతున్న విద్యాశాఖకు కళాశాల స్థాయిలో పట్టింపు కరువైంది. స్కూల్ లెవల్‌లో క్రీడాపోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఇంటర్‌కు వచ్చే సరికి కనీసం శిక్షకులు లేక నైపుణ్యం కరువవుతుంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు డిగ్రీ, పది ఇంటర్ ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. అగ్రహారం డిగ్రీ కాలేజీలో మినహా ఎక్కడ కూడా పీడీ(ఫిజికల్ డైరెక్టర్)లు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.
లెక్చరర్లతోనే శిక్షణ..
జిల్లాలోని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఒక్కో కాలేజీకి రూ.10వేలు కేటాయించింది. ఈ నిధులతో క్రీడా సామాగ్రిని కొనుగోలు చేశారు. కానీ విద్యార్థులకు ఆటలపై శిక్షణ ఇచ్చే పీడీలు లేరు. దీంతో కాలేజీలోని వివిధ సబ్జెక్టుల అధ్యాపకులే ప్రతీ శనివారం సాయంత్రం ఆటలు ఆడిస్తున్నారు. వీరి సమక్షంలో విద్యార్థులు ఆటలపై పట్టు సాధించలేకపోతున్నారు. దీంతో వీరు ఏ క్రీడాపోటీల్లో పాల్గొనడం లేదు. ఒక వేళ పాల్గొన్న పతకాలు రావడం లేదు.
ఇక్కడ ఇలా.. అక్కడ అలా !
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో పీడీలు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతుంటే.. గురుకుల విద్యార్థులకు ప్రత్యేకంగా పీఈటీలు ఉండడంతో ఆటల్లో రాణిస్తున్నారు. గురుకుల విద్యార్థులు పాల్గొంటున్నారంటే పతకం ఖాయం చేసుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. వారికి ఉన్నత విద్యలో స్పోర్ట్స్ విభాగంలో రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. క్రీడా కోటాలో చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు సైతం సాధించారు. గురుకుల విద్యార్థులకు క్రీడలతో లబ్ధి జరుగుతుండగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మాత్రం ఆ ఫలితాలు దక్కడం లేదు.