మౌలాబి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన ముస్లింలు, ప్రజా సంఘాలు 7 గంటలకు పైగా నిరసన.. కనిగిరిలో హైటెన్షన్ కేసు సెక్షన్‌ల మార్పు తర్వాత మృతదేహం ఇంటికి తీసుకెళ్లిన వైనం మౌలాబి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్న మాజీ మంత్రి సురేష్
సయ్యద్ మౌలాబి బౌతిక కాయాన్ని ముస్లిం సాంప్రదాయ పద్థతిలో మంగళవారం రాత్రి ఖననం చేశారు. తొలుత స్థానిక ఒంగోలు బస్టాండ్‌లో మౌలాబి కుటుంబానికి న్యాయం చేయాలని, తౌషిక్, మౌలాబి మృతికి కారకులైన సింగరాయకొండ నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్, ప్రజా సంఘాలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, పాలకులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ, అధికార నిర్లక్ష్య తీరును తీవ్రంగా ఎండగట్టారు. కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తొలుత బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయ్య యాదవ్ మౌలాబి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
నిందితులను శిక్షిస్తేనే న్యాయం..
కనిగిరిరూరల్: సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తన బిడ్డ సయ్యద్ తౌషిక్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోరాడిన బాలుడి తల్లి మౌలాబీ చివరకు ఆత్మహత్య చేసుకుంది. 12వ తేదీ ఆమె హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మృతి చెందితే తీవ్ర జాప్యం తరువాత పోస్టుమార్టం నిర్వహించి సోమవారం రాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించారు. సయ్యద్ మౌలాబి మృతదేహంతో మార్కాపురం జిల్లా కనిగిరికి చేరుకున్న విషయం తెలుసుకున్న ముస్లిం మైనార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఘటన స్థలానికి చేరుకున్నారు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తేలేదని బాధిత కుటుంబీకులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దీంతో మార్కాపురం ఓఎస్డీ, అడిషనల్ ఎస్సీ మిశ్రా, దర్శి డీఎస్పీ బాల మురళీ కృష్ణ, కనిగిరి ఇన్‌చార్జి డీఎస్పీ పీ శ్రీధర్, కనిగిరి, సింగరాయకొండ సీఐలు, ఎస్సైలు, పోలీసులు భారీ బందోబస్తుతో రంగంలోకి దిగారు. దాదాపు 7 గంటలకు పైగా నిరసన కార్యక్రమం సాగింది. దీంతో కనిగిరి పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పోలీసుల తీరుపై నిరసన
మౌలాబి మృతదేహాన్ని కనిగిరికి తరలించే క్రమంలో కూడా పోలీసు భారీ బందోబస్తుతో అడుగడుగునా అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇక్కట్లకు గురి చేసినట్లు మృతురాలి భర్త సయ్యద్ ఆలీ ఆరోపించారు. తెల్లవారుజామున కనిగిరికి చేరిన మృతదేహంను నేరుగా పట్టణంలోకి లోపలి నుంచి కాకుండా హైవే మీదుగా ఇంటికి తీసుకెళ్లాలని పోలీసులు ఆంక్షలు పెట్టారు. దీంతో మౌలాబి కుటుంబీకులు, బంధువులు అడ్డంతిరిగి స్థానిక హైవే జంక్షన్ పొదిలిరోడ్డు వద్ద మృతదేహాన్ని కింద పెట్టి ఆందోళనకు దిగారు.
అడుగడుగునా నిర్లక్ష్యం
తన బిడ్డ తౌషిక్ మృతి కారణం కోచింగ్ సెంటర్ యాజమాన్యమేని, తన కుమారుడిది అనుమానాస్పద మృతి కాదని, ఆత్మహత్య కాదని, ముమ్మాటికి కోచింగ్ సెంటర్ యాజమాన్యం చేసిన హత్యేనని తల్లి మౌలాబి 7 నెలలుగా పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదని మృతురాలి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు ధ్వజమెత్తారు మౌలాబి వద్దకు అసలు గడ్డి మందు డబ్బా ఏలా వచ్చిందో.. తేల్చాలని, దీనిపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. సూసైడ్ నోట్‌లో మౌలాబి స్పష్టంగా కోచింగ్ సెంటర్ యాజమాన్యం.. కొంతమంది వ్యక్తుల పేర్లు రాసినా, సెల్ఫీ వీడియోలో చెప్పినా పట్టించుకోకుండా.. ఆత్మహత్య కేసుగా నమోదు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తల్లీ బిడ్డల మృతికి కారుకులైన వారిపై కేసుల నమోదుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఓఎస్డీ మిశ్రా, డీఎస్పీలు విషయాన్ని ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో మాట్లాడారు. ఈ మేరకు మౌలాబి మృతి కేసును ప్రేరిపిత ఆత్మహత్య (108 బీఎన్‌ఎస్) కింద మార్చుతున్నట్లు తెలిపారు. అయితే ఆ కేసులో ఉన్న వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేయాలని కోరారు. అందుకు సమయం పడుతుందనే భావనను పోలీసులు వ్యక్తం చేశారు. దీంతో తౌషిక్ మృతి కేసులో కూడా పోలీసులు ఇలానే కాలయాపన చేశారని.. దీన్ని కూడా అలాగే నీరు గార్చుతారని, తక్షణం చర్యలు తీసుకోవాలని బాధితులు నిరసన తెలిపారు. ఈక్రమంలో మళ్లీ కొద్దిసేపు గందరగోళం జరిగింది.
మాట తూలిన పోలీసులు..
బాధితులు తమ నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు మాట తూలారు.. బంద్ కరో డ్రామా అనే పదాన్ని వాడారు. దీనిపై మృతురాలి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, మైనార్టీ సంఘాలు, పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తులను కోల్పోయిన బాధలో కుటుంబ సభ్యులుంటే..ఉన్నత స్థాయి హోదాలో ఉన్న పోలీసులు అలా మాట్లాడటం సరైంది కాదంటూ తీవ్ర నిరసన తెలిపారు. వెంటనే ఆ మాటలను ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ, సీపీఐ, బీసీవై పార్టీల నేతలు డిమాండ్ చేశారు. దీంతో వాతావరణం మళ్లీ వేడిక్కింది. ఈ క్రమంలో దర్శి డీఎస్పీ బాలమురళీ కృష్ణ తాము అలా అనలేదని.. పొరపాటుగా భావించవద్దని సర్దిచెప్పారు. దీంతో మౌలాబి మృతదేహాన్ని ఇంటికి తరలించారు.
మంత్రులు ఎందుకు స్పందించడం లేదు: మాజీ మంత్రి సురేష్ ధ్వజం
విద్యార్థి సయ్యద్ తౌషిక్, తల్లి మౌలాబిలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం మౌలాబి భౌతిక కాయాన్ని కనిగిరిలో స్థానిక పార్టీ నేతలతో కలిసి ఆయన సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. సురేష్ వెంట పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్‌రెడ్డి (బన్నీ), మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పులి శాంతి గోవర్ధన్‌రెడ్డి, ఆయిమల్ల నాగమణి, ఎస్‌కే డాక్టర్ రసూల్, భారతీ, నాగూర్‌బీ, షకీలా, ఇండ్లా భాను, పలుకూరి భాస్కర్, కరీముల్లా, నాగూర్‌వలి, సందాని, స్థానిక నాయకులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
అలాగే తౌషిక్, మౌలాబి మృతులకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ, కాంగ్రెస్, బీసీవై, పార్టీల, మైనార్టీ, ప్రజా సంఘాల నాయకులు సయ్యద్ యాసీన్, ఎస్‌కే సైదా, లీలా కృష్ణ యాదవ్, నరేంద్రా, చల్లా హరి, వెంకటరమణ, పాశం వెంకటేశ్వర్లు, మీసాల సామ్రాజ్యం డిమాండ్ చేశారు. మౌలాబీ మరణ వాగ్మూలంలో వెల్లడించిన పేర్లు ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు.


