మండలానికో జైలు కావాలి | - | Sakshi
Sakshi News home page

మండలానికో జైలు కావాలి

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విమర్శ

రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో

సింగరాయకొండ: నియోజకవర్గంలో మంత్రి స్వామి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయటానికి తహతహలాడుతున్నాడని ఇలాగైతే మండలానికో జైలు తప్పనిసరి అని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. మండలంలో ఇటీవల శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున జరిగిన గొడవపై అక్రమ కేసులు బనాయించటంతో ఒంగోలు జైలులో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులను మంగళవారం ఆయన పరామర్శించారు. డాక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీ రాంనగర్‌లో వేడుకలు జరుగుతుంటే చూసి ఓర్వలేని టీడీపీ సానుభూతిపరుడు మోరుబోయిన వంశీ మద్యం తాగి వచ్చి మరీ వేడుకలకు అడ్డంకి కల్పించే క్రమంలో జరిగిన దాడిలో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై 307 కేసు నమోదు చేయటం ఎంతవరకు సమంజసమని పోలీసుల తీరును దుయ్యబట్టారు. పోలీసులు అంబేడ్కర్‌ రాజ్యాంగం ప్రకారం పనిచేయటం లేదని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం మంత్రి స్వామి కళ్లల్లో ఆనందం కోసం పనిచేస్తున్నారని ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తూ పోతే జిల్లాలో జైలు చాలదని మండలానికో జైలు నిర్మించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపుతామని చెప్పి స్టేషన్‌కు పిలిపించి ఈ విధంగా ఉద్దేశపూర్వక హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో వంశీ వచ్చి గొడవ పెట్టుకున్నాడే తప్ప వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన నక్కా కోటయ్య, సిరిమల్లె ఆదినారాయణ, మతకాల మహేంద్ర కాదన్నారు. విచిత్రం ఏంటంటే ఈ గొడవలో నక్కా కోటయ్య, సిరిమల్లె ఆదినారాయణ లేరు. కానీ వీరి పేర్లను మంత్రి స్వామి చెప్పారని అక్రమంగా బనాయించారని, అంతేకాక పోలీసులు వీరిని జీవీఆర్‌ ఫ్యాక్టరీ వద్దకు తీసుకుని వెళ్లి వారిపై చేయిచేసుకుని మరీ వారి చేతిలో కర్రలు, చేతికి వేసుకునే కంకణం ఉంచి మరీ ఫొటోలు తీశారని, ఇదేమని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులే ఇలా ప్రవర్తిస్తే సామాన్యునికి భధ్రత ఎక్కడని ప్రశ్నించారు. వీరే గొడవలు చేస్తారు... వీరే కేసులు పెడతారు... పోలీసులు టీడీపీ వారు చెప్పిన వారిని జైల్లో పెడతారని విమర్శించారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ముగ్గురిని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సురేష్‌ వెంట పార్టీ నాయకులు దాసరి శేషయ్య, సంపత్‌ ప్రభాకర్‌, చిమట వెంకటేశ్వర్లు, సయ్యద్‌ ఆబిద్‌ ఆలీ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement