అప్రూవ్‌..ఐదు శాతం | - | Sakshi
Sakshi News home page

అప్రూవ్‌..ఐదు శాతం

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

ప్రకాశం జిల్లాలో

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 వేల దరఖాస్తులు ప్రకాశం జిల్లాలో 39 వేలు, మార్కాపురం జిల్లాలో 20 వేల దరఖాస్తులు తొలి రోజు నుంచే వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు వరుస సెలవులు.. నేడు తుది గడువు దరఖాస్తు అప్‌లోడ్‌ అవుతుందో లేదోనని లబ్ధిదారుల ఆందోళన

మార్కాపురం జిల్లాలో

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇవ్వలేదు. ఎట్టకేలకు దరఖాస్తులకు అవకాశం కల్పించినా సర్వర్‌ సమస్యలు వెన్నాడుతుండటంతో అర్హుల్లో ఆందోళన నెలకొంది. దరఖాస్తులకు నేటితో గడువు ముగియనుంది. అయినా ఇంత వరకు పూర్తిస్థాయిలో దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదు పూర్తికాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 59 వేల దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన వాటిలో కనీసం ఐదు శాతం కూడా అప్రూవ్‌ కాకపోవడం గమనార్హం. మరోవైపు దరఖాస్తుల కోసం అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాల కోసం కూడా సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులకు దరఖాస్తు దశలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 7 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనా.. తొలి రెండు రోజులు సర్వర్‌ పనిచేయక లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. ఆ తర్వాత కూడా ప్రక్రియ నెమ్మదిగానే సాగుతోంది. 12, 13, 14 వరకు వరుస సెలవులు రావడం, మంగళవారం పలుచోట్ల మళ్లీ సర్వర్‌ మొరాయించడంతో దరఖాస్తుదారులపై ఒత్తిడి పెరిగింది. బుధవారంతో గడువు ముగియనుండటంతో చివరి రోజు భారీగా దరఖాస్తులు వస్తే సర్వర్‌పై మరింత భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 905 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలు ఉన్నాయి. 3,57,063 మందికి పింఛన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిద రకాల కొర్రీలు పెడుతూ సుమారు 50 వేల పింఛన్‌లను తొలగించింది. రెండున్నర సంవత్సరాల తర్వాత కొత్త పింఛన్‌లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సిబ్బంది ఉదయం నుంచే సచివాలయాలకు వచ్చినా.. సర్వర్‌ అందుబాటులో లేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల సాయంత్రం తర్వాత సర్వర్‌ పనిచేయడంతో సిబ్బందిని మళ్లీ పిలిపించి దరఖాస్తులు అప్‌లోడ్‌ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక సచివాలయానికి పది దరఖాస్తులు వస్తే నాలుగు కూడా పూర్తికావడం లేదు. మరోవైపు పింఛన్‌ దరఖాస్తులకు అవసరమైన ఇన్‌కం సర్టిఫికెట్లు, కులధ్రువీకరణ పత్రాలు లేనివారు వాటి కోసం కూడా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారినీ సర్వర్‌ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

గడువు పొడిగించాలన్న డిమాండ్‌

సర్వర్‌ సమస్యలతో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు మరో అవకాశం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. చివరి రోజు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వస్తే సర్వర్‌ బిజీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక లోపాలతో తమకు పింఛన్‌ దూరమవుతుందేమోనని పలువురు వాపోతున్నారు.

ప్రకాశం జిల్లా: ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, కొండపి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలో శుక్రవారం నాటికి 21,766 దరఖాస్తులు రాగా.. మంగళవారం నాటికి 39,010 దరఖాస్తులు వచ్చాయి. 463 దరఖాస్తులు మాత్రమే అపూవ్‌ అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా వద్ధాప్య పింఛన్‌ కోసం 20,665, తరువాత వితంతు పింఛన్‌ కోసం 8777, దివ్యాంగ పింఛన్‌ కోసం 3927 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో ఐదు శాతం కూడా అప్రూవ్‌ చేయలేదు.

మార్కాపురం జిల్లా: మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మంగళవారం సాయంత్రానికి మొత్తం 20,155 దరఖాస్తులు నమోదయ్యాయి. తర్లుపాడు మండలంలో మంగళవారం పింఛను దరఖాస్తుకు సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. నూతన పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో విద్యుత్‌ బిల్లు వివరాలను సీపీటీసీ ద్వారా ఎంటర్‌ చేయాల్సి ఉండగా సర్వర్‌ పనిచేయలేదని పలువురు లబ్ధిదారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్య ఏర్పడింది. దీంతో తమకు పింఛను అందకుండా పోతుందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్‌ సమస్యలు తీర్చి, దరఖాస్తు గడువును పొడిగించాలని అర్హులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement