అమాత్యులూ..తగునా..! | - | Sakshi
Sakshi News home page

అమాత్యులూ..తగునా..!

Aug 2 2026 2:04 AM | Updated on Aug 2 2026 2:04 AM

ఎండోమెంట్‌ భూమిగా నమోదైన 33 ఎకరాల గ్రామకంఠం వాస్తవానికి ఆలయ భూమి 33 సెంట్లు మూడు దశాబ్దాలుగా దైవాలరావూరు వాసుల కష్టాలు పట్టించుకోని మంత్రులు నిలిచిన పీఏసీఎస్‌ భవన నిర్మాణ పనులు ఆ పరిధిలో ఆగిన క్రయ, విక్రయాలు బ్యాంకు రుణాలు పొందేందుకు ఇబ్బందే

మేదరమెట్ల: అధికారులు చేసిన తప్పునకు మూడు దశాబ్దాలుగా గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. గ్రామ కంఠం ఎండో మెంట్‌ భూమిగా రికార్డుల్లో తప్పుగా నమోదైంది. ఈ సమస్యను పరిష్కరించమని మంత్రులను వేడుకుంటున్నా మోక్షం లభించలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. కొరిశపాడు మండలంలో దైవాలరావూరులోని చెన్నకేశవ స్వామి దేవస్థానం విస్తీర్ణం 33 సెంట్లు. అయితే అది రెవెన్యూ రికార్డులలో 33 ఎకరాలుగా నమోదైంది. దీంతో ఆ 33 ఎకరాల పరిధిలో క్రయ, విక్రయాలు నిలిచాయి. బ్యాంకు రుణాలు పొందేందుకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో ఆస్తి ఉండీ... ఏదన్నా అవసరానికి వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగిన పీఏసీఎస్‌ భవన నిర్మాణం

దైవాలరావూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి నూతన భవనం నిర్మించాలని సంఘ పాలకవర్గం, సభ్యులు భావించారు. అందుకు సంబంధించి స్థలం ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయి. అయితే సదరు స్థలం ఎండోమెంట్‌ పరిధిలో చేరిన 33 ఎకరాల్లో ఉంది. దీంతో ఆ స్థలం సొసైటీకి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వీలుకాక నిర్మాణం ఆగింది.

పలుమార్లు మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకెళ్లినా..

సదరు 33 ఎకరాల పరిధి ఎండోమెంట్‌లో చేరటంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామానికి పలు సందర్భాల్లో వచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. అందులో గ్రామానికి చెందిన పలువురు పెద్దలతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు. అయితే నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. గ్రామస్తులు వెళ్లినపుడు మంత్రి రవికుమార్‌ దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మంత్రులకు తీరికలేదా అంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. రెండు విభాగాల అధికారులు సైతం మాటలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement