యానాదులపై ఆగడాలకు పాల్పడుతున్న మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు ఏజంట్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన యానాదుల సంఘం అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం, ఉద్రిక్తత
ఒంగోలు టౌన్:
మైక్రో ఫైనాన్స్ ఏజంట్లు వేధిస్తున్నారని, మహిళలను అసభ్యంగా దూషిస్తున్నారని, ఇళ్లకు తాళాలు వేస్తున్నారని, ఫ్లెక్సీలు వేసి బజారుకీడుస్తున్నారని, మైక్రో ఫైనాన్స్ ఆగడాలను అరికట్టకపోతే ఆత్మహత్యలే గతి అని రోదిస్తూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రధాన రహదారి వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి మైక్రో ఫైనాన్స్ ఆగడాలను అరికట్టాలని, వేధింపులకు పాల్పడుతున్న ఏజంట్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని నినాదాలు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు యానాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గట్టిగా కేకలు వేసుకుంటూ వాదించుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడకు చేరుకున్న ఒన్‌టౌన్ సీఐ వీర నాయక్ బాధితులను సముదాయించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న ధర్నా చౌక్ వద్ద కూర్చొని నిరసన తెలపాలని సూచించారు. అయినా ఆందోళనకారులు వినలేదు. మైక్రో ఫైనాన్స్ ఏజంట్లు వచ్చి తమను వేదిస్తున్నప్పుడు పోలీసులు ఎక్కడకు పోయారని, మహిళలను దూషించడమే కాకుండా తమ ఇళ్లకు తాళాలు వేసినవారిని పోలీసులు ఎందుకు శిక్షించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే మీడియాతో మాట్లాడుతామని పట్టుపట్టడంతో చివరికి పోలీసులు అంగీకరించక తప్పలేదు.
అమాయక గిరిజనులను మోసగిస్తున్న మైక్రోఫైనాన్స్ సంస్థలు...
యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం, కందుకూరు, మద్దిపాడు మండలాల్లో అమాయక యానాది గిరిజనులను మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు మోసగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన పక్కా గృహాల తాలుకూ పట్టాలు హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నాయని, కొంతమంది మైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజంట్లు, ఇతర శాఖల అధికారులతో కుమ్మకై ్క తమను అప్పుల ఊబిలో దించుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పక్కా గృహాలకు రిజిస్ట్రేషన్ చేయించి వాటి పేరు మీద రుణాలు తీసుకుంటున్నారని వివరించారు. యానాది గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రూ.2 లక్షలు మంజూరు చేసినట్లు పత్రాలు సృష్టించి లబ్ధిదారులకు కొంత ముట్టచెప్పి మిగిలింది కాజేస్తున్నారని వివరించారు. ఇప్పుడు రూ.3.75 లక్షల బాకీ ఉన్నారని, వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. చెల్లింపులు చేయని వారి ఇళ్లకు తాళాలు వేయడం, ఇళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, కుటుంబ సభ్యుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బజారుకీడ్చడం వంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ పి.రాజబాబుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గా ప్రసాద్, యాకసిరి నాగరాజు, తిరువీధి సతీష్ చంద్ర, బాపట్ల వెంకటరావు, తిరుపతమ్మ పాల్గొన్నారు.


