ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని రూ.9 లక్షలు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం పేరుతో రూ.12 లక్షలు స్వాహా నకిలీ ఆర్డర్ చేతిలో పెట్టిన మోసగాడు నిందితునిపై గతంలో రూ.3 కోట్లు వసూళ్లు చేసినట్లు మూడు కేసులు డీఎస్పీ బాలమురళీ కృష్ణ
దర్శి: ‘‘నాకు ఓఎస్‌డీతో పరిచయాలున్నాయి... అంతకంటే పెద్దపెద్ద వాళ్లు కూడా బాగా తెలుసు. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు చిటికెలో ఇప్పిస్తాను’’ అంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి నకిలీ నియామక ఆర్డర్‌లు చేతిలో పెట్టిన ఘరానా మోసగాన్ని డీఎస్పీ బాలమురళీకృష్ణ కటకటాల వెనక్కు నెట్టారు. దర్శి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలులోని నీలాయపాలెం మార్కెట్ సెంటర్‌లో నివాసం ఉంటున్న ముత్తన నాగరాజు ఒక కన్సల్టెన్సీ కార్యాలయం పెట్టి అధికార పార్టీ మంత్రుల ఓఎస్‌డీలు తెలుసు, కలెక్టర్‌లు తెలుసు.. అంతకంటే పెద్దవారు తెలుసు అని చెప్పుకుంటూ ఒంగోలులో హోంగార్డుగా పని చేస్తున్న గోపాల కృష్ణ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అతని భార్యకు ఔట్‌సోర్సింగ్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఉద్యోగం కోసం అతని వద్ద రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత తన వద్ద ఉన్న గొంతులు మార్పులు చేసి వినిపించే ఫీచర్ ఉన్న సెల్‌ఫోన్‌లో ఇతరులతో మాట్లాడించి ఓఎస్‌డీగారు మాట్లాడతారని చెప్పి నమ్మించాడు. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెబుతూ బోల్తాకొట్టించాడు. ఆ తరువాత ఒక నకిలీ ఆర్డర్ కాపీ చేయించి హోంగార్డుకు అందజేసి ఉద్యోగ నియామకపత్రం వచ్చిందని, వారు ఫోన్ చేసినప్పుడు మాట్లాడి జాయిన్ అవ్వాలని చెప్పాడు. ఆ తరువాత డిగ్రీ చదివిన అదే హోంగార్డుకు ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికాడు. మళ్లీ వారి వద్ద రూ.9 లక్షలు తీసుకున్నాడు. ఇదే తరహాలో ఫోన్‌లో మాట్లాడించి ఆర్డర్ కాపీ కూడా ఇచ్చాడు. ఆ తరువాత హోంగార్డు ఆయా కార్యాలయాల్లో సంప్రదించి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన డీఎస్పీ బాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో బల్లికురవ ఎస్సై నాగరాజుకు వచ్చిన సమాచారం మేరకు బల్లికురవ బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్‌చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఆయన వద్ద ఉన్న రూ.3.50 లక్షల నగదు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే నిందితుడు గతంలో మూడు కేసుల్లో రూ.3 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఇంకా ఇతని బాధితులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ జరుగుతోందని తెలిపారు. ఇలా నకిలీ పత్రాలు ఇచ్చి ఇటీవల ఉద్యోగాల పేరుతో డబ్బులు స్వాహా చేసే మోసగాళ్ల వలలో పడిన యువత తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. యువతను ఇలాంటి వారు ఎవరైనా సంప్రదించినా వెంటనే తమకు వివరాలు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఏడో తరగతి చదువుకున్న వ్యక్తి డిగ్రీలు చేసిన వారిని మోసం చేస్తున్నారని యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. చాకచక్యంతో నిందితుడిని పట్టుకున్న డీఎస్పీ బాలమురళీకృష్ణ, ఎస్సై నాగరాజులను ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ శేషగిరిరావు పాల్గొన్నారు.


