భ్రమరా వెంచర్స్‌పై దర్యాప్తు చేయించండి | - | Sakshi
Sakshi News home page

భ్రమరా వెంచర్స్‌పై దర్యాప్తు చేయించండి

Jul 28 2026 5:11 AM | Updated on Jul 28 2026 5:11 AM

కలెక్టరేట్‌ భవన నిర్మాణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి రోడ్ల మార్కింగ్‌లో అపోహలకు తావివ్వవద్దు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు

మార్కాపురం: మార్కాపురం పట్టణ శివార్లలో ఏర్పాటు చేసిన భ్రమరా వెంచర్స్‌లో ఉన్న ఆక్రమణలు, ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు చేయించాలని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులుకు వినతిపత్రం అందించి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్కాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, దేవదాయ భూములు, నీటి చెరువులు, కుంటలు, పంట కాలువలు, చెరువు నుంచి ఆయకట్టు భూములకు నీరు వెళ్లే ప్రధాన కాలువలు, వాటికి ఇరువైపులా ఉండే సర్వీసు రోడ్డు మార్జిన్లు, వాగులు తదితర వాటిని కొందరు దురాక్రమణ చేసి స్వాధీన పరుచుకున్నారన్నారు. వాటి పక్కనే ఉన్న పట్టా భూములను కూడా కలుపుకుని ఆక్రమించిన భూమి అసలైన సర్వేనంబరు కాకుండా తప్పుడు సర్వేనంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో రాసి అమ్మకాలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. భ్రమరా వెంచర్స్‌ వారు ప్రభుత్వ భూములు, చెరువులకు నీరు వచ్చే వాగు, బండ్ల రస్తాలను కలుపుకున్నారనే అభియోగాలు ఉన్నాయని అన్నారు. ఆ వెంచరుకు రహదారి సౌకర్యంలేదని, నీళ్లు వచ్చే వాగుకు అడ్డంగా కల్వర్టులు కట్టి తారురోడ్డు వేశారని అన్నారు. దీనివలన చెరువుకు రావాల్సిన నీరు ఆగిపోయి వ లోతట్టు ప్రాంతం మునిగిపోతుందన్నారు. ఇప్పటికే చెరువులు పూడ్చి రోడ్డు వేసే ప్రాంతానికి పక్కనే చెరువులో అంతర్భాగమైన ప్రాంతాన్ని పట్టా భూములని చెప్పి మట్టితోలారని అన్నారు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. చెరువులో ఎఫ్‌టీఎల్‌ (చెరువు నిండే పూర్తి సామర్ధ్యం) ఆపైన 50 మీటర్ల వరకూ బఫర్‌జోన్‌ ఉంటుందన్నారు. అందులో కూడా శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని అన్నారు. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో దేవదాయ శాఖ భూములు చాలా ఉన్నాయని, అందులో కూడా భారీగా ఆక్రమణలు జరిగాయన్నారు. ఆశాఖ అధికారులు వ్యక్తిగత లబ్ధి కోసం కొందరికి మాత్రమే నోటీసులు ఇచ్చి కొన్ని ఆస్తులను స్వాధీన పరుచుకున్నారని, మరికొందరు ఆక్రమణదారులపై ఉదాసీనంగా ఉంటూ ఆస్తులను స్వాధీనపరుచుకోలేదన్నారు. వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. దీనివలన దేవదాయశాఖ ఆస్తులు కోల్పోతోందన్నారు. కొందరు అధికారుల సహకారంతో వాస్తవ సర్వే నంబర్లతో కాకుండా వేరే నంబర్లు వేసి నిషేధిత భూములను సైతం రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారన్నారు. భూ దోపిడీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. చెరువును దురాక్రమణదారుల నుంచి కాపాడాలన్నారు.

మార్కింగ్‌ విషయంలో అపోహలు తొలగించండి..

పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో వివిధ ప్రాంతాల్లో మార్కింగ్‌ ఇచ్చారని, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని అన్నా రాంబాబు విజ్ఞప్తి చేశారు. మార్కింగ్‌ ఇచ్చే భవన యజమానులకై నా సమాచారం అందించాలని కోరారు. ఈ మార్కింగ్‌ ఎవరు వేస్తున్నారో అర్థంకాక అందరూ ఆందోళనకు గురవుతున్నారన్నారు.

కలెక్టరేట్‌ భవనాల విషయంలో ఆలోచించండి..

కలెక్టరేట్‌ భవనాల విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, ఆలోచించి అందరి అభిప్రాయం తీసుకొని నిర్మించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించాలన్నారు. జీవితకాలం ప్రజలకు ఉపయోగపడే అంశం ఇది అన్నారు. ఈ విషయమై జేసీ సానుకూలంగా స్పందించారని, భ్రమరా వెంచర్స్‌పై అధికారుల కమిటీని నియమించినట్లు చెప్పారన్నారు. పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. తాము చేసిన ఆరోపణలు నిజమైతే వెంచర్స్‌లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని రాంబాబు కోరారు. ఈయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ మీర్జా షంషేర్‌ ఆలీబేగ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ సలీమ్‌, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఉన్న బట్టగిరి తిరుపతిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, గౌస్‌ మొహిద్దీన్‌, బొగ్గరపు శేషయ్య, నాలి కొండయ్య, మౌలాలీ, గఫూర్‌, సీయం ఖాశీం, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement