యర్రగొండపాలెం: అధికారులు కింది స్థాయి సిబ్బందికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండా అన్‌ఫైన్డబుల్ కింద నమోదు చేయించడం చంద్రబాబు ప్రభుత్వం పన్నిన పన్నాగంలో భాగమేనని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో 45 లక్షల ఓటర్లను తొలగింపులో సింహ భాగం ఆచూకీ దొరకటం లేదంటే వీరంతా రాష్ట్రం నుంచి పారిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఆ ఓటర్లను కావాలని తొలగించారన్న ఆరోపణలు వస్తున్నా అందుకు సమాధానం చెప్పగలిగే సత్తా అధికారంలో ఉన్న టీడీపీ పెద్దలకు లేదని అన్నారు. కనిపించకుండా పోయారంటున్న ఓటర్లను కనిపెట్టకపోవడం అంటే ఈ ప్రభుత్వం సక్రమంగా పాలన చేస్తుందా.. లేకుంటే నిద్రపోతుందా అన్న అనుమానం వస్తోందని, ఒక వేళ ఆచూకీ దొరకలేదంటున్న వారు మరో చోట ఎన్‌రోల్ అయిఉంటే ఆచూకీ దొరకలేదని ఏ విధంగా అంటున్నారని ప్రశ్నించారు. సక్రమంగా ఎన్నికల్లో నెగ్గలేని చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకమిదని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేయకూడదన్నారు.
లోకేశ్ రాజీనామా చేయాలి
నైతిక బాధ్యత తీసుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి డిమాండ్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్‌పై బాధ్యత వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అంతకంటే పెద్ద స్కాం డీఎస్సీ కుంభకోణం సాక్ష్యాధారాలతో సహా బయటపడితే అందుకు మీరు నైతిక బాధ్యత ఎందుకు వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా కాక్రోచ్ జరిపిన ఆందోళనను తలపించేలా రాష్ట్రంలోని యువత, విద్యార్థులు సిద్ధమవుతున్నారని, అంతకంటే ముందుగానే లోకేశ్ రాజీనామా చేయడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.
ఒంగోలు సిటీ: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒంగోలులో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ నుంచి శాంతియుతంగా ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కు ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


