ఒంగోలు టౌన్: పొగాకు కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి రైతులను మోసం చేసేలా ఉందని, రైతులు ఆందోళనలు చేసిన ప్రతిసారి ఏదో సమీక్షలు చేస్తున్నట్లు హడావుడి చేయడం పరిపాటిగా మారిందని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు విమర్శించారు. ఈ నెల 23 నుంచి జిల్లాలోని పొగాకు రైతులను చైతన్యం చేస్తూ నిర్వహించిన మోటారు బైకు యాత్ర సోమవారం ముగిసింది. ఈ నేపథ్యంలో మాదాల నారాయణ స్వామి భవనంలో నిర్వహించిన సమావేశంలో చుండూరి మాట్లాడుతూ పొగాకు రైతులకు ఎలాంటి మేలు చేయకుండా ఏదో చేస్తున్నట్లు మభ్య పెట్టే ధోరణితో వ్యవహరిస్తున్న చంద్రబాబు కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 2020లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థల చేత కొనుగోలు చేయించినట్లు ఇప్పుడు చేయడంలేదని విమర్శించారు. నాటి ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన రైతులు లబ్ధి పొందారని చెప్పారు. అందుకు విరుద్ధంగా నేడు చంద్రబాబు రైతుల పట్ల కపట ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సమీక్ష కాలంలో కేజీ పొగాకు రూ.26 కు తగ్గిందని తెలిపారు. ఈ నెల 29వ తేదీ జాతీయ రహదారుల దిగ్బంధనం చేపడుతున్నట్లు ప్రకటించారు. త్రోవగుంట సమీపంలోని ముదిగొండి బ్రిడ్జి నుంచి మండవవారిపాలెం రోడ్డు సమీపంలో, టంగుటూరు టోల్ ప్లాజా వరకు రహదారులను దిగ్బంధనం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జజ్జూరి జయంతిబాబు, ఎస్ లలిత కుమారి, తూబాటి శ్రీకాంత్, సాగర్, టి.ప్రబాకర్, బి.పద్మ, ఆర్.లక్ష్మి, వెంకటరావు, వడ్డే హనుమా రెడ్డి పాల్గొన్నారు.
పోలీసుల అనుమతి లేదు– డీఎస్పీ
పొగాకు రైతులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. డివిజన్‌లో 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున నేషనల్ హైవేపై ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు.


