గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 4 2026 9:25 AM | Updated on Jun 4 2026 9:25 AM

గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026 కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా... సింగరాయకొండ అడ్డాగా...

న్యూస్‌రీల్‌

జిల్లాలో కాలేజీ విద్యార్థులు గంజాయికి బాగా అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులతో పాటుగా చివరికి ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు కూడా నిత్యం గంజాయి తాగుతున్నట్లు సమాచారం. దీంతో తరచుగా కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు వంటి నేరాలకు పాల్పడుతున్నారని, పేకాట, కోడిపందేలు ఆడుతున్నారని తెలుస్తోంది. గంజాయికి అలవాటు పడిన 17 ఏళ్ల ఒక మైనర్‌ బాలుడిని రిమాండ్‌కు పంపించినట్లు సమాచారం.

జిల్లాలోని పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. విద్యార్థులు గంజాయి మత్తులో చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి భారీగా తరలిపోతోంది. ఒంగోలులో బుధవారం ఒక మినీ లారీలో సుమారు 250 కిలోలకు పైగా గంజాయి పట్టుబడడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

ఇటీవల కాలంలో సింగరాయకొండ గంజాయి విక్రయాలకు అడ్డాగా మారిందని పోలీసుల్లో ప్రచారం జరుగుతోంది. సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడులో గంజాయి విక్రేతల వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయని సమాచారం. మంగళవారం సింగరాయకొండలో ఒక వృద్ధురాలిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకొని ఆమె నుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఆమెను పోలీసులు పలుమార్లు పట్టుకున్నారు. ఆ మధ్య సదరు వృద్ధురాలు రిమాండ్‌కు వెళ్లి వచ్చింది. అయినా ఆమె గంజాయి విక్రయాలు ఆపడం లేదు. జిల్లాలో వలస కార్మికులు అధికంగా చీమకుర్తి గ్రానైట్‌ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బీహార్‌, ఒడిశా నుంచి వచ్చిన కార్మికులు గతంలో గంజాయి తీసుకొచ్చి విక్రయించేవారు. ఇటీవల పోలీసు తాకిడి ఎక్కువ కావడంతో బీహారీలు కేవలం బీహారీలకు, ఒడిశా వాళ్లు ఒడిశా వాళ్లకు మాత్రమే గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. స్థానికులకు గంజాయి అమ్మడంలేదని సమాచారం. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో ఒంగోలు పరిసరాల్లో గంజాయి తీసుకునేవారు ఇటీవల సూరారెడ్డిపాలెంలోని ఒక పాత గ్రానైట్‌ డంప్‌ను అడ్డాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్లో ఒక పోలీసు ఉద్యోగి కనుసన్నల్లో గంజాయి విక్రయాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కందుకూరులో అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కందుకూరులో పోలీసులు హడావుడి చేయడం గమనార్హం.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

జిల్లా కేంద్రమైన ఒంగోలు గంజాయి కారిడార్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఒడిశా, వైజాగ్‌ నుంచి ఒంగోలు మీదుగా తమిళనాడు, కేరళకు ప్రతి నిత్యం గంజాయి భారీగా తరలిపోతోంది. హైవే, రైల్వే మార్గాల గుండా గంజాయి ముఠా సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్నారు. ఒంగోలు శివారులోని కొప్పోలు ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో బుధవారం ఒక మినీ లారీలో భారీగా గంజాయి పట్టుబడడంతో పోలీసు అధికారులు విస్తుపోయారు. సుమారు 250 కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. ఈ ఏడాది మార్చిలో గూడూరు వద్ద కూడా ఇదే తరహాలో గంజాయి పట్టుబడింది. జిల్లా మీద నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలించడం అటుంచితే గత రెండేళ్లలో జిల్లాలో గంజాయి విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మారుమూల మండలాల్లో కూడా గంజాయి పట్టుబడుతోంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మద్యం తాగడానికి అలవాటు పడిన విద్యార్థులు ఇప్పుడు గంజాయి తీసుకొని మత్తుగా జోగుతున్నారు. మత్తులో చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తమ కళ్ల ముందే కన్నబిడ్డలు గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటుంటే చూడలేక తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మేము అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే గంజాయిని నూరు శాతం కట్టడి చేశామని డబ్బాకొట్టుకుంటున్నారు.

250 కిలోలకు పైగా గంజాయి పట్టివేత...

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 కిలోలకు పైగా గంజాయి పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బుధవారం తెలవారుజామున రెండు గంటల సమయంలో ఒంగోలు శివారులోని కల్వరి టెంపుల్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక మినీ లారీని మోటారు బైకు మీద వస్తున్న కొడియం లోకేష్‌ (21) వెనక నుంచి ఢీకొన్నాడు. సమాచారం తెలుసుకున్న తాలుకా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమానం వచ్చి ఘటనా స్థలంలో ఉన్న ఏషర్‌ మినీ లారీని పరిశీలించగా అందులో బియ్యం తవుడు మధ్య రహస్యంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. మొత్తం 9 బస్తాల గంజాయి లభ్యమైంది. ఇందులో సుమారు 280 నుంచి 300 కిలోల గంజాయి ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి ముందు 4 నుంచి 5 గంటల వరకు ఈ లారీ అక్కడే నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రమాదం కనుక జరగకపోయి ఉంటే గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రాష్ట్రం సరిహద్దులు దాటి ఉండేది. నాలుగైదు గంటలపాటు ఒక మినీ లారీ రోడ్డు పక్కన నిలబెట్టి ఉంచినా కనీసం ఒక్క పోలీసు అధికారి కూడా వాకబు చేయకపోవడం గురించి విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు నిఘా వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గుడ్లూరు సమీపంలో కూడా ఇదే తరహాలో...

ఈ ఏడాది మార్చి 16వ తేదీ గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 19 కిలోల గంజాయి పట్టుబడింది. అతివేగంగా వెడుతున్న కారు గుడ్లూరు మండలం మోచర్ల వద్ద కూలీలతో ఉన్న ఆటోను వెనకనుంచి ఢీ కొట్టడంతో ఇద్దరు కూలీలు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న గంజాయి ప్యాకెట్లను తీసి నిందితులు ముళ్ల పొదల్లో దాచారు. ఆ తరువాత విచారణలో గంజాయి గుట్టు రట్టయింది. సరిగ్గా రెండు నెలల తరువాత ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ రెండు సంఘటనల్లోనూ ప్రమాదాలే గంజాయిని పట్టించాయి.

గంజాయి తరలింపునకు జంక్షన్‌గా మారిన ఒంగోలు

జిల్లా మీద నుంచి భారీగా గంజాయి అక్రమ రవాణా

నేషనల్‌ హైవే, రైల్వే మార్గాలగుండా తరలిస్తున్న ముఠా

రోడ్డు ప్రమాదంతో ఒంగోలులో బయటపడిన భారీ గంజాయి

తమిళనాడుకు తరలిస్తున్న 250 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

మొన్న కందుకూరు, నిన్న సింగరాయకొండ, నేడు ఒంగోలులో వరుసగా గంజాయి పట్టివేత

జిల్లాలో యథేచ్ఛగా గంజాయి విక్రయాలు

గంజాయికి అలవాటు పడుతున్న ఇంటర్‌, డిగ్రీ కాలేజీ విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement