కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు | - | Sakshi
Sakshi News home page

కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు

Jun 4 2026 9:25 AM | Updated on Jun 4 2026 9:25 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

దర్శి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వమని మరొక సారి రుజువు చేసుకుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు అయిన సందర్భంగా ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చిన పథకాలే కాకుండా ఇతర పథకాలు కూడా అమలు చేశారన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.1500 ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రం లో 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మభ్య పెట్టాడని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తానని చెప్పి ఒక్కరికై నా ఇచ్చారా అని ప్రశ్నించారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకానికి తూట్లుపొడుస్తూ ఆర్టీసీ డిపోలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చి కొన్నింటిని పూర్తిచేయగా, మిగిలిన అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తిచేయకుండా వాటిని ప్రైవేటుపరం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారన్నారు. రైతులకు ఉచిత పంటల బీమా పథకానికి మంగళంపాడారన్నారు. మోంథా తుఫాను బాధితులకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని చెప్పారు. చంద్రబాబుకు ఓట్లేసి మోసపోయామని, మళ్లీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఈనెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని, ఈనెల 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈనెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మేధావులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐదు మండలాల కన్వీనర్లు వెన్నపూస వెంకట రెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదనరెడ్డి, దర్శి పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జీ దేవప్రసాదు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా భాస్కర్‌, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాంభూపాల్‌రెడ్డి, జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు బండి గోపాల్‌, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement