వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ సస్పెన్షన్‌

Jun 4 2026 9:25 AM | Updated on Jun 4 2026 9:25 AM

వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ సస్పెన్షన్‌ ● పెన్షన్‌ల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ ఒకటిన్నర కేజీ గంజాయి స్వాధీనం

● పెన్షన్‌ల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ

ఒంగోలు వన్‌టౌన్‌: ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని దిబ్బలరోడ్డు సచివాలయంలో వార్డు వెల్ఫేర్‌, డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా పని చేస్తున్న భీమవరపు సాయికుమార్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట కృష్ణయ్య బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలపై బుధవారం సాక్షిలో ‘విలపింఛెన్‌’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ రాజాబాబు స్పందించారు. పెన్షన్లను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పంపిణీ చేయడంలో విఫలం కావడంతో పాటు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం వంటి వాటిపై విచారణకు ఆదేశించారు. ఆమేరకు మున్సిపల్‌ అధికారులు విచారణ నిర్వహించి కలెక్టర్‌కు నివేదిక అందించారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు సాయికుమార్‌ను మున్సిపల్‌ అధికారులు సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సింగరాయకొండ: గంజాయి అమ్ముతున్న యువకుడిని బుధవారం అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఒకటిన్నర కేజీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ పీ శ్రీహరి కథనం ప్రకారం కుటుంబ ఆర్ధిక సమస్యలతో మద్యం, గంజాయికి బానిసైన మండల కేంద్రంలోని డ్రైవర్‌పేట 4వ లైనులో నివసిస్తున్న తన్నీరు శివమహేష్‌ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేందుకు గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుకు వెళ్లి కేజీ రూ.5 వేలకు తీసుకొచ్చి ఇక్కడ చిన్నచిన్న ప్యాకెట్లుగా విభజించి గుర్తుతెలియని వ్యక్తులకు కేజీ రూ.20 వేలకు అమ్ముతున్నాడు. ఎప్పటిలాగా గంజాయి తీసుకొచ్చిన శివమహేష్‌ వేరొకరికి అమ్మేందుకు ఒంగోలు–సింగరాయకొండ సర్వీసు రోడ్డులోని కే బిట్రగుంట రిక్వెస్ట్‌ బస్టాపు వద్ద వేచి ఉండగా అటుగా వస్తున్న సీఐ వాహనం చూసి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. దీంతో అతనిని పట్టుకుని విచారించి అతని వద్ద ఉన్న ఒకటిన్నర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్‌ సుధీర్‌కుమార్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement