చీమకుర్తి: బైకుపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వచ్చిన గ్రానైట్ కంటైనర్‌ను ఢీకొట్టి రోడ్డు మీద పడ్డారు. అదే సమయంలో బైకు వెనుకే వస్తున్న ట్రాక్టర్ వారిలో ఒకరిని తొక్కించుకుంటూ పోవడంతో మృతిచెందగా, రెండో వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. బుధవారం మధ్యాహ్నం చీమకుర్తి బైపాస్‌లో కూనంనేనివారిపాలెం రోడ్డు వైపు ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కనిగిరికి చెందిన నాగులూరి శాంసన్ (29) గతంలో పొదిలి, చీమకుర్తిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, వాటిలోని రాగి తీగ దొంగతనం చేసి దాదాపు 30కిపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతనిపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. చీమకుర్తిలో 2023లో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసులో కూడా శాంసన్ ఉన్నాడు. పొదిలి కేసులో పీటీ వారంట్‌పై సంతనూతలపాడు పోలీసులు కూడా గతంలో శాంసన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సంతనూతలపాడు ఎస్సై కూడా ధ్రువీకరించారు. మృతుడి బంధువులు రావడంలో జాప్యం కావడంతో పూర్తి వివరాలు సేకరించాక కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలిని చీమకుర్తి సీఐ డీ ప్రసాదరావు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా, బైకు మీదున్న రెండో వ్యక్తి పోలా ప్రసాద్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.


