ఆన్‌లైన్‌లోనూ అదే తీరు
మార్కాపురం:
నొప్పిని నియంత్రించే స్టెరాయిడ్లు, సోయ లేకుండా నిద్ర పట్టేందుకు స్లీపింగ్ పిల్స్, తక్కువ ధరలోనే మత్తులో తూగేందుకు దగ్గు మందు.. ఇలా ఏది కావాలంటే అది అవసరమైన వారికి సులువుగా సొంతమవుతోంది. కాంపిటీషన్, డబ్బు సంపాదన యావలో పడిన మెడికల్ షాపుల నిర్వాహకుల్లో కొందరు ఔషధ నియంత్రణ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా నిషేధిక మందులు, ఉత్ప్రేరకాలు విక్రయించడం ఆందోళన కలిగించే అంశం. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే ప్రమాదకరమైన మందులను కొన్ని మెడికల్ షాపుల్లో విక్రయిస్తుండటంతో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు చివరకు ముప్పుగా పరిణమిస్తున్నాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 800 మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో డాక్టర్ల ప్రిస్కిప్షన్‌తో పని లేకుండానే యాంటీబయోటిక్స్, నిద్ర మాత్రలు, స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్స్ లాంటి ప్రమాదకర మందులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జలుబు మొదలు పెద్ద వ్యాధులతో బాధపడుతున్న వారిలో పలువురు స్వయం చికిత్స కోసం మెడికల్ షాపులపై ఆధారపడుతున్నారు. అదే సమయంలో ఫార్మసీ సిబ్బంది లేకుండా మెడికల్ షాపుల యజమానులు డాక్టర్ల మాదిరిగా సలహాలు ఇస్తూ మందులు అమ్మడం సర్వసాధారణంగా మారింది. గ్రామాల్లోని కిరాణా షాపుల్లోనూ వివిధ రకాల ట్యాబ్లెట్లు లభ్యమవుతున్నాయి. వాటిలో యాంటిబయోటిక్స్, నిద్ర మాత్రలు కూడా ఉండటం గమనార్హం.
వారికి ఉపశమనం.. వీరికి ఆదాయం
రోగుల అవసరాన్ని కొన్ని మందుల షాపుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, ఒంగోలు, పొదిలి, దర్శితోపాటు వివిధ పట్టణాల్లో మందుల షాపుల యజమానులు ఇచ్చిందే మాత్ర, అమ్మిందే ధరగా పరిస్థితి తయారైంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆస్పత్రుల ఫీజులు భరించలేక జ్వరం, దగ్గు, విరేచనాలు అయితే తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాన్ని గమనించిన మందుల షాపుల యజమానులు తమకు ఇష్టమొచ్చిన మాత్రతో పాటు అదనంగా ప్రతి రోగానికి యాంటిబయోటిక్స్‌ను జత చేసి విక్రయిస్తున్నారు. మరికొందరైతే మిడి మిడి జ్ఞానంతో ఇంజక్షన్లు సైతం విక్రయిస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపీ డాక్టర్లు సైతం అనధికార మెడికల్ షాపులు నిర్వహించటం విశేషం. అర్హత ఉన్న కెమిస్ట్, డ్రగ్గిస్ట్‌లు మాత్రమే రోగులకు మందులు విక్రయించాలి. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తమకు తెలిసిన వారి సర్టిఫికెట్లతోనూ మందుల షాపులు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కంపెనీల కమీషన్ల దందా
వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్‌కు, మెడికల్ షాపుల యజమానులు ఇచ్చే మందులకు పొంతన ఉండకపోగా, ఇదేమని ప్రశ్నిస్తే కంపెనీ తేడా మందు ఒకటే అంటూ రోగులను మాయ చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. మార్కెట్‌లో వివిధ రకాల కంపెనీలు కమీషన్ల ఆశ చూపుతుండటంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి దుకాణంలో రికార్డులు, బిల్లు పుస్తకాలు, తప్పనిసరిగా నిర్వహించాలి. వినియోగదారునికి ధరతో కూడిన బిల్లును ఇవ్వాలి. వీటిని ఆచరిస్తున్న షాపులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
యథేచ్ఛగా మందుల విక్రయం
మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మిసోప్రోస్టల్ (అబార్షన్ కిట్), డయాబెటిక్ మందులు, బీపీ మందులు, డైక్లోఫినాక్ మాత్రలు, నిద్రమాత్రలు(ఆల్ఫ్రాజోలం, డైజోఫాం) విక్రయిస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. డాక్టర్ సలహా లేకుండా వాడితే సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయి. అబార్షన్ కిట్ డాక్టర్ సలహా లేకుండా వాడితే బ్లీడింగ్ ఎక్కువై ప్రాణానికే ప్రమాదం సంభవిస్తుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీలు పాడైపోతాయి. బీపీ, డయాబెటిక్ మందులు ఇష్టమొచ్చినట్లు వాడితే మెదడు, గుండైపె తీవ్ర ప్రభావం చూపుతాయి.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయం
కిరాణా షాపుల్లోనూ దొరుకుతున్న
యాంటీబయోటిక్స్
విచ్చలవిడిగా లభ్యమవుతున్న
నిద్రమాత్రలు, స్టెరాయిడ్స్
ప్రమాదంలో ప్రజారోగ్యం..
చోద్యం చూస్తున్న బాబు ప్రభుత్వం
ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలకు వీలుకల్పించే జీయస్‌ఆర్ 817(ఇ) రూల్‌ను ఉపసంహరించుకోవాలని మెడికల్ షాపుల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. కార్పోరేట్ సంస్ధలు అధిక డిస్కౌంట్లతో అనైతిక వ్యాపారం చేస్తున్నాయనేది వారి వాదన. కోవిడ్ సమయంలో అత్యవసర మందుల పంపిణీకి వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన జీఎస్‌ఆర్ 220(ఇ)ని సైతం ఉపసంహరించాలన్న డిమాండ్ మూడేళ్లుగా ఉంది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో నకిలీ ప్రిస్క్రిప్షన్ తయారు చేసి ఆన్‌లైన్‌లో యాంటీబయోటిక్స్, మత్తు కల్పించే మందులు, షెడ్యూల్ హెచ్, హెచ్–1, ఎక్స్ లాంటి నియంత్రిత, సున్నితమైన మందులను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టమొచ్చినట్లు మందులు అమ్మే మెడికల్ షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటాం. మందుల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు కూడా డాక్టర్ సూచన లేనిదే మందులు వాడకూడదు.
– ఉషారాణి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మార్కాపురం


