పొగాకు వ్యాపారులవి కుంటిసాకులే.. | - | Sakshi
Sakshi News home page

పొగాకు వ్యాపారులవి కుంటిసాకులే..

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

కందుకూరు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లించే విషయంలో వ్యాపారులు కుంటిసాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయంతిబాబు ధ్వజమెత్తారు. జూన్‌ 1న నిర్వహించనున్న పొగాకు బోర్డుకు రాయబార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ చేస్తున్న ప్రచారంలో భాగంగా శుక్రవారం కందుకూరు–1 వేలం కేంద్రాన్ని రైతు సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జయంతిబాబు మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వడం లేదని రైతులు అడిగితే పొగాకు ఎక్కువ పండిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కర్ణాటకలో 100 మిలియన్‌ కేజీల పొగాకు పండించేందుకు అనుమతి ఇవ్వగా 85 మిలియన్‌ కేజీలే దిగుబడి వచ్చిందని, అక్కడ ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పొగాకు ఎక్కువ పండింది అనేది కేవలం వ్యాపారులు చెప్పే సాకు మాత్రమేనని స్పష్టం చేశారు. లోగ్రేడ్‌ పండితే హైగ్రేడ్‌ కావాలని, హైగ్రేడ్‌ పండితే లోగ్రేడ్‌ కావాలని వ్యాపారులు కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. సాదారణంగా నాణ్యమైన పొగాకును ఎవరైనా కోరుకుంటారని కానీ ఇక్కడ పొగాకు వ్యాపారుల వైఖరి విరుద్ధంగా ఉందన్నారు. గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు. పొగాకుపై రూ.80 వేల కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు కేవలం రూ.500 కోట్లు అప్పుగా ఇవ్వడానికి ప్రభుత్వాలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించడం వల్ల వ్యాపారులకు ఆదాయం పెరిగింది, సిగరెట్‌ తాగేవాళ్లకు భారంగా మారిందన్నారు. కానీ రైతులకు మాత్రం ఏ ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా పొగాకు రైతులను ఆదుకునేందుకు టుబాకో బోర్డు రాయబార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు పమిడి వెంకట్రావు, కార్యదర్శి మాదాల రమణయ్య, సీఐటీయూ నాయకులు ఎస్‌ఏ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర ఇవ్వకుండా

రైతులను మోసం చేస్తున్నారు

రైతు సంఘ జిల్లా కార్యదర్శి జయంతిబాబు ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement