● ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
మార్కాపురం: పోలీసుశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధనరాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన సమర్ధవంతమైన పోలీసు సేవలు అందించే అవకాశం ఉందన్నారు. అనంతరం మార్కాపురం జిల్లాలో జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక నిమిత్తం మార్కాపురం, పొదిలి ప్రధాన రహదారిపై రాయవరం గ్రామ సమీపంలో ఉన్న సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. కార్యాలయ ఏర్పాటుకు భూమి స్థితి, రవాణా సౌకర్యాల అందుబాటు, భధ్రతా పరమైన అంశాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి అవకాశాలను పోలీసులతో సమీక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, పరేడ్ గ్రౌండ్, ఆర్మ్‌డ్ రిజర్వు వంటి కీలక విభాగాలను ఏర్పాటుచేసేందుకు అనువైన పరిస్థితులపై చర్చించారు. ఈయన వెంట డీఎస్పీ నాగరాజు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై వేమన అధికారులు పాల్గొన్నారు.
పొదిలి: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, వారి సమస్యలు పోలీస్ పరిధిలో తక్షణమే పరిష్కారం అయ్యేలా పోలీసులు శ్రద్ధ చూపాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు రకాల కేసులపై సమీక్ష నిర్వహించారు. సర్కిల్ పరిధిలో నమోదైన కేసులపై సమీక్ష చేశారు. పురోగతి, దర్యాప్తు తీరు గురించి ఆరా తీశారు. తరుచూ జరుగుతున్న నేరాల అదుపునకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు, మాదక ద్రవ్యాల దుష్పరిమాణాలు, సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో వృత్తి నైపుణ్యతతో శాసీ్త్రయ పద్ధతులతో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నిందితులను అరెస్టు చేయడంతో పాటు, బాదితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూను వేగవంతం చేయాలని నిందితులను పట్టుకోవాలన్నారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు, ఇతర అనుమానిత వస్తువుల వాడకం, రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల, రాంగ్ రూట్లో ప్రయాణాలు, మైనర్‌లు వాహనాలు నడిపితే చర్యలు కఠినంగా ఉంటాయని అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు శక్తి యాప్‌ను ఉపయోగించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల్లో జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలన్నారు. ఎస్పీ వెంట ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావు, సీఐ రాజేష్ ఉన్నారు.


