జిల్లా వ్యాప్తంగా పవిత్ర రంజాన్ పండుగను శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని ఈద్గా మైదానాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈద్గాల వరకు రాలేని వారి కోసం ఎక్కడికక్కడ మసీదుల్లో ప్రత్యేక నమాజు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఇస్లాంపేటలోని మక్కా మసీదులో తెల్లవారుజాము 4 గంటలకు రంజాన్ దువాతో పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. మక్కా మసీదులో నిర్వహించిన దువాకు నగరంలోని 50 డివిజన్ల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇస్లాంపేట కమ్యూనిటీ హాలు ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. ఆ తరువాత ఉదయం 7.30 గంటల నుంచి మొదలుకొని ప్రతి అర్ధగంటకు ఒక మసీదులో పండుగ నమాజు నిర్వహించారు. దీంతో నగరంలోని 22 మసీదులు భక్తులతో సందడిగా మారాయి. చివరిగా ఈద్గా మైదానంలో గం.10.30కు నమాజు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా అత్తరు ఘుమఘుమలతో, తక్బీర్ పఠిస్తున్న ముస్లింలు దర్శనమిచ్చారు. ప్రధాన కూడళ్లలో గుమిగూడిన ముస్లింలు సామూహికంగా తక్బీర్ పఠిస్తూ ఈద్గా మైదానం వైపునకు తరలి రావడంతో గద్దలగుంట వద్ద ఉన్న ఈద్గా మైదానం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఎస్పీ హర్షవర్థన్ రాజు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈద్గా మైదానానికి వెళ్లే ముస్లింలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నగరం నలువైపులా ట్రాఫిక్ పోలీసులను నియమించారు. రాజా పానగల్ రోడ్డు నుంచి గద్దల గుంటకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నియంత్రించడమే కాకుండా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రశాంతంగా ఈద్గాలో నమాజు ప్రార్థనలు చేసుకున్నారు. ఈద్గా మైదానానికి వచ్చే భక్తుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాట్లు చేశాయి. ఈద్గా నమాజు తర్వాత ముస్లింలు ఒకరినొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఈద్గా మైదానానికి తరలివచ్చిన పలువురు హిందూ, క్రిస్టియన్ స్నేహితులు అలాయ్ బలాయ్ చేసి ఈద్ ముబారక్ చెప్పారు. సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకోవడం ఆకట్టుకుంది. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్‌లు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు, మార్కాపురం, గిద్దలూరు, కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అన్నా రాంబాబు, కుందురు నాగార్జున రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి, ఒంగోలు, అద్దంకి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు దద్దాల నారాయణ యాదవ్, చుండూరి రవిబాబు, డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు.
ఒంగోలు ఈద్గా మైదానంలో ప్రార్థన చేస్తున్న ముస్లింలు
పొదిలిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు
ఒంగోలు టౌన్:
దేశ ప్రజలందరినీ కరుణించు ప్రభు...
ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఖుద్బా ప్రసంగం చేసిన మౌలానా రంజాన్ మాసం విశిష్టతను వివరించి చెప్పారు. రంజాన్ మాసంలో 30 రోజుల పాటు నిష్టగా పాటించిన ఉపవాస దీక్షల స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. సమాజంలోని పేదలను ప్రేమగా దగ్గరకు తీయాలని, అభాగ్యులను, అనాథలను ఆదరించి అక్కున చేర్చుకోవాలని చెప్పారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ చదివించాలని ఉన్నత స్థానాలనధిరోహించేలా ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం జరిగిన దువాలో దేశ ప్రజల మధ్య సహోదర భావాన్ని పెంపొదించాలని, కులమతాలకతీతంగా ప్రజలందరిపై వరాల వసంతాన్ని కురిపించాలని అల్లాహ్‌ను వేడుకున్నారు. యుద్ధంలో పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు, యువకులు నలిగిపోకుండా రక్షించాలని, ప్రపంచ శాంతిని ప్రసాదించాలని కన్నీటితో దువా చేశారు.
ఆలింగనంతో ఈద్ ముబారక్ చెప్పుకుంటున్న చిన్నారులు
జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు
ఒంగోలులోని 22 మసీదులతో పాటుగా ఈద్గా మైదానంలో ప్రత్యేక నమాజు
ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపిన వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిలు, నాయకులు
అలాయ్ బలాయ్ చేసుకొని సోదర భావం చాటుకున్న హిందూ, ముస్లింలు