ఒంగోలు టౌన్:
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం పట్ల మన దేశ పాలకులు వ్యూహాత్మకంగా మౌనం పాటించడం క్షమార్హం కాదని జనసాహితి జిల్లా అధ్యక్షుడు జీవీ కృష్ణయ్య స్పష్టం చేశారు. అంతర్జాతీయ కవితా దినాన్ని పురస్కరించుకొని ఎన్జీవో హోంలో శనివారం సామ్రాజ్యవాద యుద్ధంపై కవితాస్త్రాలు పేరుతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీ కృష్ణయ్య మాట్లాడుతూ అంతులేని పెట్రో దాహంతో , ఆయుధ వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టేందుకు అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ప్రపంచ ప్రజలపై యుద్ధాన్ని రుద్దుతున్నాయని మండిపడ్డారు. యుద్ధ ప్రభావం మన దేశంపై తీవ్రంగా ఉంటుందని, ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందని తెలిపారు. ఇప్పటికే మనదేశంలో వంటగ్యాస్ ధరలు పెంచారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత పెట్రోలు ధరలు పెంచే అవకాశం ఉందని చెప్పారు. గ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్లు మూతపడుతున్నాయని, దీంతో వందలాది మంది హోటల్ కార్మికులు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు పెట్రోలు ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటడం ఖాయమన్నారు. యుద్ధం పేదరికాన్ని మరింతగా పెంచుతుందని, ఆకలి చావులకు కారణమవుతుందన్నారు. యుద్దాన్ని ఖండించాల్సిన కేంద్రంలోని మోదీ సర్కార్ మౌనం పాటించడం బాధాకరమన్నారు. అనంతరం అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవిబాబు అనువదించిన ఆంగ్ల కవితల సంపుటి ‘కలమే నా ఆయుధం’ పుస్తకాన్ని కవి, రచయిత ఎస్‌ఎస్ హుస్సేన్ పరిచయం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన కవిత్వాన్ని అనువదించిన కొత్తపల్లి రవిబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎజ్రాశాస్త్రి, రవికుమార్, కోటేశ్వరమ్మ, ఎంఏ సాలార్, ఎస్.లలిత కుమారి, ప్రసన్న, విజయ భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఏసుదాసు, డీవీ ఖాదర్ బాషా, యోహాన్‌రెడ్డి పాల్గొన్నారు.


