తౌషిక్ మృతిపై న్యాయం కోసం తల్లిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీ ఎక్కని గడప లేదు. మొక్కని అధికారి లేడు. కలెక్టర్ పి.రాజాబాబును కలిసి తమ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్పీ హర్షవర్థన్‌రాజును కలిసి న్యాయం చేయమని వేడుకున్నారు. చివరకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడకు వెళ్లి నిరసన చేపట్టారు. అయినా కనుచూపు మేరలో న్యాయం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ఇటీవల తౌషిక్ తల్లి మౌలాబి అర్ధరాత్రి శ్మశాన వాటికకు వెళ్లి కుమారుడి సమాధిపై పడి రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. బుధవారం కనిగిరిలోని ఒక మూడంతస్తుల బిల్డింగు ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేగింది. నెల రోజులుగా ఆ ఇంట్లో సంతోషం లేదు. రంజాన్ పండుగ సందడి లేదు. ఆ తల్లిదండ్రులు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఫలిస్తుందో లేదో చూడాల్సి ఉంది.


