ఒంగోలు టౌన్: సింగరాయకొండ శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్లో చదువుతున్న సయ్యద్ తౌషిక్ చనిపోయి నెల రోజులు దాటింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్లాడు..అమ్మకు ఫోన్ చేసి బిర్యానీ తీసుకొని రమ్మంటూ అడిగిన పసివాడు ...కళ్లు మూసి తెరచేలోపే నిముషాల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం ఏ తల్లిదండ్రులకైనా ఎలా నమ్మబుద్ధవుతుంది. పాపం పుణ్యం తెలియని బాలుడు, కల్లా కపడం ఎరగని చిన్నారి, మాయా మర్మంలేని పిల్లాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే ఎవరైనా ఎలా నమ్మగలరు. తౌషిక్‌ను చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తౌషిక్‌ను హత్య చేశారని లోకం కోడై కూస్తోంది. కానీ పోలీసులు మాత్రం తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నందు వల్లనే చనిపోయాడని ప్రకటించారు. నెల రోజులుగా ఆ తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు. తన బిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కనిపించిన అధికారికి దండం పెట్టి వేడుకుంటున్నారు. అయితేనేం పట్టించుకునే నాథుడే లేడు. పరామర్శించే నాయకుడే లేడు.
తౌషిక్ కుటుంబాన్ని
మంత్రి పరామర్శించలేదు...
చిన్నారి తౌషిక్ అనుమానాస్పదంగా మరణించింది సింగరాయకొండలోని పాఠశాలలో. ఇది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు నియోజకవర్గం పరిధిలో ఉంది. కన్నీరు మున్నీరవుతున్న బాలుడి తల్లిదండ్రులను ఆయన పరామర్శించలేదు. నెల రోజులుగా ఆ పసిబాలుడి తల్లిదండ్రులు న్యాయం కోసం రోడ్డెక్కి పోరాడుతుంటే పట్టించుకోకపోవడం సరికాదని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనీసం పలకరించని ఉగ్ర...
మృతుడు తౌషిక్ స్వగ్రామం కనిగిరి. తండ్రి సయ్యద్ అలీ కారు డ్రైవర్. తల్లి మౌలాబీ సాధారణ గృహిణి. తౌషిక్ అనుమానాస్పద మృతిపై కనిగిరిలో మతాలకతీతంగా ప్రజలు భారీ ర్యాలీ చేశారు. అయినప్పటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాత్రం కనీసం పలకరించిన పాపాన పోలేదు. ఎమ్మెల్యేని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుందామని వెళితే కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రముఖుల ఆదేశాలతోనే కేసు పక్కదారి...
శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడికి అధికార పార్టీకి చెందిన ఒక నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సదరు నేత పోలీసులకు ఫోన్ చేసినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. అలాగే తౌషిక్ మృతి చెందిన రోజే పోలీసులకు జిల్లాకు చెందిన మరో కీలక ప్రజాప్రతినిధి నుంచి కూడా ఫోన్ వచ్చిందని జోరుగా ప్రచారం జరిగింది. తౌషిక్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ అదే రోజు బాలుడి తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట రోడ్డు మీద పడుకొని నిరసనకు దిగారు. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. అధికార పార్టీకి చెందిన వారు ఫోన్ చేయడంతో సింగరాయకొండ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడని, తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎలా చెబుతాడని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఆ తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తౌషిక్ మృతిపై విచారణాధికారిగా కందుకూరు సీఐ అన్వర్ బాషాను నియమించారు. అధికారి మారినప్పటికీ పోలీసులు మాత్రం ఆత్మహత్య కోణం నుంచే విచారణ చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తుండడం గమనార్హం. చివరికి వారి అనుమానాలు నిజమయ్యాయి. విచారణ పూర్తి కాకుండానే తౌషిక్ ఆత్మహత్య చేసుకొని మరణించాడని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రకటించారు.
చిన్నారి తౌషిక్ మరణించి నెలరోజులు దాటినా పరామర్శించడానికి మనసురాని మంత్రి, ఎమ్మెల్యే
న్యాయం కోసం పోరాడుతున్నా నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం
నిందితులను అరెస్టు చేయడానికి వెనకాడుతున్న పోలీసులు
విచారణ కొనసాగుతుందంటూనే తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించిన డీఎస్పీ
11 ఏళ్ల చిన్నారి మృతిపై న్యాయం చేయలేని ప్రభుత్వం ప్రజలకేం న్యాయం చేస్తుందని బాధితుల ప్రశ్న


