రియల్‌ బూచి! | - | Sakshi
Sakshi News home page

రియల్‌ బూచి!

Dec 20 2025 9:12 AM | Updated on Dec 20 2025 9:12 AM

రియల్‌ బూచి!

రియల్‌ బూచి!

జిల్లా ప్రకటనతో మొదలైన రియల్‌ దందా మా భూములున్న ప్రాంతాల్లోనే కార్యాలయాలు అంటున్న అధికార పార్టీ నేతలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వాలిపోయిన రియల్‌ బ్రోకర్లు వ్యాపారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులే టార్గెట్‌ కంభం, బేస్తవారిపేట, కనిగిరి, గిద్దలూరు వాసుల హడావుడి డబుల్‌ రిజిస్ట్రేషన్ల అమ్మకాలతో మోసాలు పదిరోజుల్లో అమాంతం పెరిగిన భూముల ధరలు

మా భూముల వద్దే పెట్టండి..

జిల్లాకు రెక్కలొచ్చి..

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌

మార్కాపురం: మార్కాపురం జిల్లా కాబోతుందన్న ప్రకటనను అడ్డుపెట్టుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బ్రోకర్లు పట్టణంలో వాలిపోయారు. పది రోజులుగా పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే హడావుడి. తెల్లవారి ఎనిమిది గంటల నుంచే వీరి హంగామా మొదలైపోతోంది. ప్రధానంగా తర్లుపాడు రోడ్డు జాతరను తలపించేలా జనంతో కిటకిటలాడుతోంది. వ్యాపారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు లక్ష్యంగా మోసాలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రియల్‌ బ్రోకర్ల మాయాజాలంలో కనిగిరి, గిద్దలూరు, కంభం, బేస్తవారిపేటకు చెందిన పలువురు ఉద్యోగులు, వ్యాపారులు చిక్కుకున్నారని తెలుస్తోంది. స్థలాల రేట్లు అమాంతం పెంచేశారు. పూలసుబ్బయ్య కాలనీ నుంచి అల్లూరి పోలేరమ్మ గుడి, హోంగార్‌ుడ్స కాలనీ, ఇందిరమ్మ కాలనీ, నరసింహాపురం స్తోత్రియం, లిక్కర్‌ గోడౌన్‌, పట్టు పరిశ్రమ కార్యాలయం తదితర ప్రాంతాల్లో మొన్నటి వరకూ గజం రూ.10 వేలు పలికేది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో గజం ధర ఏకంగా రూ.25 వేలకు చేరింది. దీనిని గమనిస్తే భూమాయ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతుంది. త్వరగా లాభాలు వస్తాయన్న ఆశతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు యర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దదోర్నాల నుంచి కూడా పలువురు వ్యాపారులు, ఉద్యోగులు మూడు కుంటల స్థలం కొనిపెడితే మంచి రేటు వస్తుంది కదా అని ముందు వెనుక చూసుకోకుండా కొంటున్నారు. ఇదే అదునుగా రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసి మాయమాటలు చెప్పి అంటగడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇది బయటపడటంతో కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటున్నారు. ఇటువంటి సంఘటనే మూడు రోజుల క్రితం తర్లుపాడు రోడ్డులోని అల్లూరి పోలేరమ్మగుడి వద్ద చోటుచేసుకుంది. ఇందిరమ్మ కాలనీలో సుమారు 150 ప్లాట్లను భూకబ్జాదారులు రాత్రికి రాత్రే కబ్జా చేసి తాత్కాలికంగా సిమెంటు ఇటుకలతో బేస్‌మెంటు కట్టారు. దీంతో ఆ స్థలాన్ని కొనుగోలు చేసినవారు నిజమైన లబ్ధిదారులు రావడంతో లబోదిబోమంటున్నారు.

తిరునాళ్లను తలపిస్తున్న తర్లుపాడు రోడ్డు..

తర్లుపాడు రోడ్డులో తాత్కాలిక కార్యాలయాలు, ఆ తర్వాత శాశ్వత కార్యాలయాలు ఏర్పాటవుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆ ప్రాంతం అమ్మకం, కొనుగోలుదార్లు, బ్రోకర్ల హడావుడి ఎక్కువగా ఉండడంతో తిరునాళ్ల వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే వాహనాల రాకపోకలతో తర్లుపాడు రోడ్డులో భారీ ట్రాఫిక్‌ ఉంటోంది.

ప్రభుత్వ భూములు ఉన్నా... అటువైపు వెళ్లకండి అవసరమైతే మా పట్టా భూములు కొనుగోలు చేయండి...మా భూములు ఉన్న ప్రాంతాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలంటూ టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కొత్త జిల్లాగా ఏర్పాటు కావడంతో పట్టణంలో దాదాపు 74 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఆయా శాఖల ఆఫీసులు, అధికారులకు అవసరమైన భవనాలను తీసుకోవాలని తెరవెనుక యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాయవరం రోడ్డు, కాలేజీ రోడ్డు, వేములకోట రోడ్డు, దరిమడుగు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. రాయవరం రోడ్డులో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అయితే కూటమి నేతల భూములు ఉన్న తర్లుపాడు రోడ్డులోనే జిల్లా కార్యాలయాలు పెట్టాలని, ఆ దిశగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని స్థానిక అధికారులపై పది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తాత్కాలిక కార్యాలయాల కోసం తర్లుపాడు రోడ్డులో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల భవనాలను అద్దెకు తీసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా తమ భూముల విలువ పెంచుకోవాలని నాయకులు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు అధికారులు సైతం తర్లుపాడు రోడ్డులోనే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement