వ్యవసాయ సంక్షోభం
ఏడాదిన్నర పాలనలో రైతాంగాన్ని పట్టించుకోకుండా కబుర్లతో కాలక్షేపం మోంథా తుఫాన్ సహాయంలో కొర్రీలతో ఎగనామం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతులకు మొండిచేయి పంటల బీమా ఎత్తివేసి అన్నదాతలను నిండాముంచిన చంద్రబాబు పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలపాలు ప్రభుత్వ సాయం అందకపోవడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం మళ్లీ పెరిగిపోతున్న మైక్రో ఫైనాన్స్ బాధితులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీవీఎస్ నాగిరెడ్డి
చంద్రబాబు పాలనలో
ఒంగోలు టౌన్:
చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని, రైతులు అన్ని విధాలుగా నష్టపోయారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేక ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకునే పరిస్థితి లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారని చెప్పారు. గురువారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోంథా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోందని విమర్శించారు. ముంపు బాధితుల సంఖ్యను సక్రమంగా లెక్కించకుండా ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపెడుతోందని ఆరోపించారు. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, 99 శాతం అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లుగా చెబుతోందని, రూ.27 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించారని చెప్పారు. నిజానికి జిల్లాలో పంట నష్టం చాలా ఎక్కువగా జరిగిందని, పశ్చిమ ప్రకాశంలో ఈ నష్టం తీవ్రత మరింత ఎక్కువగా ఉందని నాగిరెడ్డి తెలిపారు. తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం నామమాత్రంగా పర్యటించిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పంటను తీసుకున్నా గిట్టుబాటుఽ ధరలు లేవని, మిర్చి, పొగాకు, శనగ పంటలు పండించిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ పంట దెబ్బతిన్నా అందులో ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో ఉంటోందని చెప్పారు. ఈ ఏడాది జిల్లాలో మిర్చి, పొగాకు, శనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, బర్లీ పొగాకు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులతో ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులు రోజుల తరబడి ఆందోళన చేయాల్సి వస్తోందన్నారు.
2014–19లోనూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు...
2014 నుంచి 2019 సంవత్సరాల మధ్యలో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసిందని ఎంవీవీఎస్ నాగిరెడ్డి గుర్తుచేశారు. జగనన్న పాలనలో 2019–24 సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు జిల్లాలో కరువు లేదని, చివరి సంవత్సరంలో 103 మండలాలలో కరువు ప్రకటించినప్పటికీ ప్రకాశం జిల్లాలో మాత్రం కరువు బారిన పడలేదని తెలిపారు. తాజాగా మళ్లీ చంద్రబాబు పాలన వచ్చేసరికి జిల్లాలో రబీలో 16 కరువు మండలాలు ఉండగా, ఖరీఫ్‌లో ప్రకటించిన 37 మండలాల్లో 3 మండలాలు జిల్లాకు చెందినవి ఉన్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న పాలనలో రైతుల వద్ద నుంచి ఒక్క రుపాయి కూడా తీసుకోకుండా పంటల బీమా అమలు చేశారని, ఎలాంటి ప్రకటనలు లేకుండా చంద్రబాబు పాలనలో పంటల బీమా ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో 85 లక్షల మంది రైతులకు పంటల బీమా చేస్తే ప్రస్తుతం కేవలం 7 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేసుకున్నారని, ఫలితంగా మోంథా తుఫాన్ వలన తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేసిందని మండిపడ్డారు. రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, మైక్రో ఫైనాన్స్ బాధితుల సంఖ్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ, పంటల బీమా, ఇతర బకాయిలు చెల్లిస్తే తప్ప మున్ముందు వ్యవసాయం చేసే పరిస్థితి లేదన్నారు. రైతులను ఆదుకోకుంటే వైఎస్సార్ సీపీ తరఫున ఉద్యమాలు చేస్తామని నాగిరెడ్డి హెచ్చరించారు.
తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవడంలో విఫలం : బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
మోంథా తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసలే కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలోని రైతులు మోంథా తుఫాన్‌తో మరింత దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్‌కు వరి, పత్తి, మినుము, ఆముదం, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీని వలన రైతులకు కోలుకోని విధంగా నష్టం వాటిల్లిందని అన్నారు. గ్రామస్థాయిలో వున్న సిబ్బందిని ఉపయోగించుకుని తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఎన్యుమరేషన్‌లో అవకతవకలు సరిచేయడానికి రీ సర్వే చేయాలని, కలెక్టర్ జోక్యం చేసుకుని తుఫాన్ బాధిత రైతులు, ఇతర బాఽధితులు ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చూడాలని కోరారు.
విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబి), రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ), కె.త్రినాథ్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, జిల్లా మాజీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, రాయలసీమ జోన్ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లు వంగల భరత్ కుమార్‌రెడ్డి, బూరుగుపల్లి సుబ్బారావు, జున్ను వెంకటేశ్వరరావు, రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురాం, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వరరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి, జిల్లా రైతు కార్యదర్శి పూసపాటి నర్సారెడ్డి, జిల్లా కార్యదర్శి సూరసాని మోహనరెడ్డి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


