నీరు తరలించటంలో అలసత్వంపై మంత్రి అసంతృప్తి
పెద్దదోర్నాల: పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాల్లోకి వచ్చిన వరద నీటిని తరలించటంలో అధికారులు అలసత్వం వహించటంపై మంత్రి నిమ్మల రామానాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగ నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు సొరంగ నిర్మాణాల్లోకి నీళ్లు చేరాయి. ఈ నేపథ్యంలో రెండోసారి ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చిన మంత్రి నీరు తోడివేయటంలో అధికారుల తీరుపై అసంతృష్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంత్రి పర్యటనలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు: సివిల్ సర్వీసెస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ బుధవారం స్థానిక మినీ స్టేడియంలో ముగిసింది. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి జి.రాజరాజేశ్వరి, బాక్సింగ్ కోచ్ వేణుతోపాటు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కోచ్‌లు ఎంపిక పోటీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి మాట్లాడుతూ.. యోగా, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, రెజ్లింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, టెన్నిస్, మ్యూజిక్, డ్యాన్స్ అండ్ షార్ట్‌ప్లేతోపాటు పలు క్రీడాంశాల్లో జిల్లా జట్లను ఎంపిక చేశామని వివరించారు. ఎంపికై న వారు ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.
యర్రగొండపాలెం: తన లారీని వదిలి పెట్టకుండా పోలీసులు స్వాధీనంలోనే ఉంచుకున్నారని మనోవేదనకు గురైన లారీ ఓనర్ కం డ్రైవర్ ముక్తిపూడి యాకోబు బుధవారం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత ఆదివారం ఇసుక తీసుకొచ్చి ఇతరులకు అన్‌లోడ్ చేస్తున్న సమయంలో అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్న పచ్చ రౌడీలు తమ పలుకుబడి ఉపయోగించి ఆ లారీని పోలీసులకు అప్పగించారు. ఈ కేసును పోలీసులు మైనింగ్ శాఖకు అప్పజెప్పారు. దాదాపు రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారని తెలుసుకున్న యాకోబు.. అంత డబ్బు కట్టలేనని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. సీసాలో పెట్రోలు పోసుకుని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అటుగా వెళ్తున్న సీఐ కె.అజయ్‌కుమార్ గమనించి, అతనిని వారించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకంలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌కేడీసీ పథకంలో నవంబర్ 2023న జిల్లాకు మంజూరు చేసిన 3 వేల లీటర్ల సామర్ధ్యం ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల లబ్ధిదారుల్లో రుణాలు చెల్లించడంలో విఫలమైన లబ్ధిదారులకు చెందిన 4 వాహనాలను షరతుల మేరకు తిరిగి మంజూరు చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒంగోలులో సౌత్ బైపాస్ వద్ద ఉన్న ప్రగతి భవన్‌లోని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా పోస్ట్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఐదుగురు ఒక గ్రూపుగా ఏర్పడాలి. గ్రూపు సభ్యులు సఫాయి కర్మచారి సర్టిఫికెట్‌లు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఐదుగురిలో ఒకరికి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. ఐదుగురు గ్రూపు సభ్యుల్లో ప్రధాన సభ్యుడు, ఇద్దరి ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీని సమర్పించాలి. సెప్టిక్ ట్యాంక్ పథకం విలువలో సబ్సిడీ పోను మిగిలిన రుణాన్ని 6 శాతం వడ్డీతో 72 నెలల వాయిదాల్లో, ఒక్కొక్క వాయిదా నెలకు రూ.33,064 చొప్పున క్రమం తప్పకుండా కార్యాలయానికి కట్టాలి. ఇతర పూర్తి వివరాలకు సెల్: 9963288656 లో సంప్రదించవచ్చు.
నీరు తరలించటంలో అలసత్వంపై మంత్రి అసంతృప్తి
నీరు తరలించటంలో అలసత్వంపై మంత్రి అసంతృప్తి


