కదిలిన జిల్లా అధికార యంత్రాంగం
కలెక్టర్ ఆదేశాలతో ఎంఈఓలతో డీఈఓ వెబెక్స్ ఆన్‌లైన్ సమావేశం రెండ్రోజుల్లో ప్రతి స్కూల్ వాటర్ సోర్స్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం ఈ మేరకు పాఠశాలల హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేసిన ఎంఈఓలు
కనిగిరిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు శుద్ధ జలం కరువై.. కలుషిత, ఫ్లోరైడ్ నీటిని తాగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వ బడుల్లో సురక్షిత నీటిని అందించేందుకు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల నిర్వహణ, మరమ్మతులకు ఈ ప్రభుత్వంలో నిధులు విడుదల కాక ఆర్వో ప్లాంట్లు మూలనపడిన వైనంపై శుక్రవారం సాక్షిలో ‘శుద్ధజలం మూలన బడి’అనేక శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశాలతో విద్యాశాఖ జిల్లా అధికారి కిరణ్ కుమార్ శుక్రవారం రాత్రి జిల్లాలోని డిప్యూటీ డీఈఓలతో, 38 మండలాల ఎంఈఓలతో వెబెక్స్ (ఆన్‌లైన్) సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 3,100 పాఠశాలలకు సంబంధించి మొత్తం సుమారు 15 అంశాలతో కూడిన ఫార్మేట్‌ను రెండ్రోజుల్లో ఇవ్వాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. అందులో పాఠశాల పేరు, యూడైస్ కోడ్ నంబర్‌తో పాటు, విద్యార్థుల సంఖ్య, హాజరు రోల్‌తో పాటు ప్రధానంగా ప్రతి విద్యార్థికి రోజుకు 5 లీటర్ల లెక్కన ఎంత నీరు అవసరం, ఎండీఎంకు ఎంత నీరు కావాలి, పాఠశాలలో వాటర్ ఆర్వో ప్లాంట్‌లు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి.. ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి?ఆర్వో ప్లాంట్‌లకు ఏ నీరు వాడుతున్నారు.. ఎన్ని బోర్లు ఉన్నాయి... వాటిలో ఫ్లోరైడ్ శాతం ఎంత.. బయట ఆర్వో ప్లాంట్ నీరు తెప్పించి విద్యార్థులకు తాగిస్తే ఆ ఆర్వో ప్లాంట్ ఎక్కడ ఉంది..అందులో ఫ్లోరైడ్ శాతం, నీటి ప్రమాణాలు ఉన్నాయా, విద్యార్ధుల వాడుకకు, తాగేందుకు ఏ బోర్ నీటిని వాడుతున్నారనేది ప్రతి పాఠశాల వారీగా నివేదిక ఇవ్వాలని ఎంఈఓలను ఆదేశించారు. శనివారం సాయంత్రానికి ముందుగా ఆ పాఠశాలలో వాడుతున్న బోర్ వెల్ లేదా.. ఆర్వో ప్లాంట్‌ల నీటిని ఎంఈఓల ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు అందజేసి నీటి పరీక్షలు చేయించాలన్నారు. ఆ నివేదిక ఆధారంగా రెండ్రోజుల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల నీటి వినియోగంపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.


