చిన్నారులకు బంగారు బాటలు వేయాలి
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు
ఒంగోలు టౌన్: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్ఫూర్తితో చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు పిలుపునిచ్చారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో చిన్నారులతో గడిపారు. జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించిన నగరంలోని సోనియా గాంధీనగర్ అంగన్‌వాడీ స్కూలు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. చిన్నారుల పేర్లు తెలుసుకుంటూ వారికి కరచాలనం ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నెహ్రూకు చిన్నపిల్లలంటే వల్లమాలిన ప్రేమ అని, ఆయన ఎక్కడికి వెళ్లినా పిల్లలతో గడపడం చేసేవారని తెలిపారు. పిల్లలు ఏ కుటుంబానికై నా, సమాజానికై నా, దేశానికై నా మూలస్తంభాలని చెప్పారు. వారికి ప్రేమను పంచాలని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. బాల్యం నుంచే వారికి నైతిక విలువలు బోధించాలని, క్రమశిక్షణ అలవాటు చేయాలని సూచించారు. సరైన ప్రేమ, ప్రోత్సహం లభిస్తే ఏ రంగంలోనైనా చిన్నారులు రాణిస్తారన్నారు. చదువుతోపాటు క్రీడలు, సృజనాత్మక రంగాల్లోనూ చిన్నారులు శ్రద్ధ చూపేలా చూడాలన్నారు. పిల్లల హక్కులను కాపాడటం, బాల్యాన్ని రక్షించడం తల్లిదండ్రులు, సమాజం బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఎం.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఆర్‌ఐ సీతారామిరెడ్డి, సోషల్ మీడియా సీఐ వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ టీచర్ జ్యోతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


