వచ్చే నెల 13న మెగా లోక్ అదాలత్
ఒంగోలు: కక్షిదారులు తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ అద్భుత అవకాశమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఒంగోలు బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో న్యాయవాదులతో ఈ సమావేశం గురించి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 13న దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో మెగా లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. అందులో పరిష్కరించుకున్న వ్యాజ్యాలకు వారు చెల్లించిన కోర్టు ఫీజు కూడా తిరిగి ఇస్తారన్నారు. లోక్ అదాలత్‌లో తీర్పు అంతిమ తీర్పు కనుక కక్షిదారుల్లో అవగాహన పెంచి పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, పాలకవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
● 8 గంటలు వేచిఉండి వెనుతిరిగిన వైనం
గిద్దలూరు(బేస్తవారిపేట): చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా సదరమ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 14వ తేదీ సదరమ్ క్యాంపులో వికలాంగులు, కంటిచూపు లేని వారు ఎవరైనా ఉంటే సంబంధిత సచివాలయానికి వెళ్లి ఉదయం 10 గంటల నుంచి తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం తెలపడంతో అనేక మంది వికలాంగులు, వృద్ధ, చెవిటి, కంటిచూపు లేని వారు సచివాలయాలకు వెళ్లి పరీక్ష చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఆయా సచివాలయాల్లో అనేక మంది ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి తమ పేర్లు నమోదు చేయాలని సిబ్బందిని కోరగా సదరమ్ సర్వర్ పని చేయడం లేదని చెప్పడంతో దాదాపు 8 గంటల పాటు నిరీక్షించారు. తమ లాంటి వారిని ఇలా వేధించడం, ఇలా నిరీక్షించేటట్లు చేయడం తగదని ప్రభుత్వ పని తీరుపై విమర్శలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు చూసి చివరకు వెనుతిరిగారు. శనివారమైనా పని చేస్తుందా అని అక్కడి సిబ్బందిని అడుగగా తమకు తెలియదని చెప్పడంతో పత్రికల్లో ప్రభుత్వం ఎందుకు ప్రకటనలు చేయాలని వారు ప్రశ్నించారు. తమ చేతిలో ఏమీ లేదని సచివాలయ సిబ్బంది సమాధానం చెప్పడంతో అంతా వెనుతిరిగారు.
పెద్దదోర్నాల: మండల పరిధిలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాలను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులతో కలిసి శుక్రవారం సందర్శించారు. వరద ముంపునకు గురైన సొరంగ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. 2026 కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి నీరు అందిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ అబూతాలింతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
సింగరాయకొండ: మద్యం తాగి ట్రావెల్స్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి సుమారు 10.40 గంటల సమయంలో సింగరాయకొండలో జరిగింది. సీఐ సీహెచ్ హజరత్తయ్య కథనం ప్రకారం పోలీస్‌స్టేషన్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా హైదరాబాద్ వెళ్తున్న నెల్లూరుకు చెందిన లక్ష్మీ నరశింహా ట్రావెల్స్ బస్సు వచ్చింది. కందుకూరుకు చెందిన బస్సు డ్రైవర్ వేణుగోపాల్‌ను తనిఖీ చేయగా మద్యం తాగి ఉన్నాడని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తరువాత బస్సు యజమానితో మాట్లాడి అదనపు డ్రైవర్‌ను పిలిపించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా బస్సును పంపనున్నట్లు సీఐ తెలిపారు.
వచ్చే నెల 13న మెగా లోక్ అదాలత్
వచ్చే నెల 13న మెగా లోక్ అదాలత్


