పేదల ప్రాణాలతో బాబు చెలగాటం | - | Sakshi
Sakshi News home page

పేదల ప్రాణాలతో బాబు చెలగాటం

Nov 15 2025 6:49 AM | Updated on Nov 15 2025 6:49 AM

పేదల ప్రాణాలతో బాబు చెలగాటం

పేదల ప్రాణాలతో బాబు చెలగాటం

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమైన ఆలోచన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్‌ ప్రభుత్వంలో మేలు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి ధ్వజం

ఒంగోలు సిటీ: ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి చంద్రబాబు మెడికల్‌ కళాశాలలను తన బినామీలకు కట్టబెడుతున్నాడని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలు నగరంలో పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నడపాల్సిన వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్‌ కళాశాలలను తీసుకొస్తే వాటిని చంద్రబాబు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంతో మేలు చేశారన్నారు. వారు ఎప్పుడూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెంటే ఉంటారని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

జెడ్పీచైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండేళ్లు కరోనాతో పోగా, మిగతా మూడేళ్లలో రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. పేదలందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే జగన్‌ లక్ష్యమన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కళాశాల అయినా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే పేద పిల్లలు చదువుకోలేరన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్నీ ఎమ్మెల్యే సీట్లను గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్పొరేట్‌ సంస్థలకు భవిష్యత్‌ తరాల తాకట్టు:

ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌.సుధాకరబాబు మాట్లాడుతూ ఎస్సీలందరూ సమన్వయంతో బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ విధానంలో నిర్వహిస్తామనడం అంటే ముమ్మాటికీ కార్పొరేట్‌ సంస్థలకు భవిష్యత్‌ తరాలను తాకట్టు పెట్టడమేనన్నారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించారని, అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.

మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలు, అమానుషాలు, అక్రమ కేసులు అన్నీ ఇన్నీ కావని విమర్శించారు. మెడికల్‌ కళాశాలలు పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికే అవసరమని అందుకే పోరాడుతున్నారన్నారు.

మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ కుల, మత, వర్గాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మెడికల్‌ కళాశాలలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్‌ వారికి ధారాదత్తం చేసేందుకే చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. దళితుల్లో ఎక్కువ మంది పేదలున్నారనీ, ఇది మీ పార్టీ అని అన్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమాన్ని అమలు చేసి చూపించిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌కు దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశారన్నారు. ప్రైవేటీకరణను ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.

కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణ యాదవ్‌, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, జోనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నల్లాని బాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఉన్నం జనార్ధన్‌, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు డి.రమణయ్య, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు చిలకా ఇశ్రాయేలు, ప్రవీణ్‌కుమార్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి మురారి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి కందుల డానియేల్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ దుడ్డు వినోద్‌, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, త్రిపురాంతకం జెడ్పీటీసీ జాన్‌పాల్‌, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి పైనం శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు చుక్కా కిరణ్‌కుమార్‌, ఏసుదాసు, గూడూరి అనీల్‌బాబు, ఆదిమూలపు లూక్‌, గిద్దలూరు ఎస్సీ సెల్‌ నాయకులు గంటా వెంకటయ్య, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు నూనె రవికుమార్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి మధు, క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా లోని ఎస్సీ సెల్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement