రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి
● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు టౌన్: మోంథా తుఫాన్ బాధిత రైతులందరినీ ఆదుకునేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, గ్రామీణ స్థాయిలో పంట నష్టం అంచనాలు తయారీలో ఎలాంటి తప్పులూ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సూచించారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో గురువారం స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని ఏ ఒక్క రైతుకూ నష్టం జరగకూడదన్నారు. మోంథా తుఫాన్ వలన నష్టపోయిన పంటలు, రహదారుల గురించి అధికారులతో చర్చించారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, సీ్త్ర శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమాలకు సంబంధించిన స్థాయీ సంఘ సమావేశాలకు ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఆయా సంఘాలకు సంబంధించిన జెడ్పీటీసీ సభ్యులు హాజరై పలు సమస్యలపై మాట్లాడారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.చిరంజీవి సమావేశాన్ని పర్యవేక్షించారు.
ఒంగోలు సబర్బన్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అధికారులెవరూ నిర్లక్ష్యం వహించకుండా త్వరగా పనులు పూర్తిచేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. స్థానిక సంతపేటలోని విద్యుత్ భవన్‌లో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల ముఖ్య పథకాలపై లోతుగా సమీక్షించారు. ఆర్డీఎస్‌ఎస్, పీఎం సూర్య ఘర్ పురోగతి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, పరివర్తకాల పనితీరు, స్మార్ట్ మీటర్లు, విద్యుత్ శాఖ మీద ప్రజల అభిప్రాయం, విద్యుత్ కనెక్షన్లు, బకాయిలపై సమీక్షించారు. ఆర్డీఎస్‌ఎస్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్లు మురళీకృష్ణ, మూర్తి, వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈలు పాల్గొన్నారు.


