77 మందిపై కేసు
వైఎస్సార్ సీపీ నాయకులు
మేరుగు
నాగార్జున,
వైఎస్సార్ సీపీ నాయకులను
అడ్డుకుంటున్న
పోలీసులు
(ఫైల్)
● మాజీ మంత్రి మేరుగు నాగార్జున, తదితర నాయకులపై నమోదు
చీమకుర్తి: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరుతూ బుధవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించినందుకు వైఎస్సార్ సీపీకి చెందిన 77 మందిపై సంతనూతలపాడు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సంతనూతలపాడు నియోజకవర్గ కేంద్రంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ పేరుతో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందువలన ప్రజాశాంతికి భంగం కలిగిందని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని, ర్యాలీలో 100 మందికంటే ఎక్కువ మంది పాల్గొన్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది గుమికూడారనే కారణాలతో సంతనూతలపాడు ఏఎస్‌ఐ జీ వెంకట్రావు ఎస్‌ఐకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 77 మంది వైఎస్సార్ సీపీ నాయకులపై 139/2025 నంబర్‌తో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, సంతనూతలపాడు జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, ఎంపీపీ బుడంగుంట విజయ, నాగులుప్పలపాడు ఎంపీపీ నల్లమలపు అంజమ్మ, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, నాయకులు కొమ్మూరి కనకారావు, నల్లమలపు కృష్ణారెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, తదితర నాయకులు కలిపి మొత్తం 77 మందిపై కేసు నమోదు చేసినట్లు సంతనూతలపాడు ఎస్సై అజయ్‌బాబు తెలిపారు. బుధవారం ఎస్సై సెలవులో ఉండటంతో ఏఎస్సై కేసు నమోదు చేశారు.
కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారు : మేరుగు నాగార్జున
ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన ర్యాలీపై పోలీసులు కేసు పెట్టడమంటే ప్రజల గొంతు నొక్కడమే అవుతుందని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంపై మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుంటే దానిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. ఎంతో ప్రశాంతంగా శాంతియుతంగా ఎవరికీ ఏ విధమైన ఇబ్బందీ కలగకుండా ర్యాలీ నిర్వహించామన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీ నాయకులు ఓర్వలేక పోలీసులను అడ్డంపెట్టుకుని 77 మందిపై కేసులు పెట్టించడం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి కేసులతో తమ పోరాటాలను ఆపాలనుకోవడం అవివేకమే అవుతుందని అన్నారు. ప్రజల కోసం నిరంతరం తమ పోరాటాలు కొనసాగుతాయన్నారు. పోలీసుల కేసులతో భయపెట్టాలని చూస్తే బెదిరేది లేదని స్పష్టం చేశారు.


