రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
● పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చాంబర్‌లో బుధవారం గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జీవీ శివారెడ్డి, జిల్లా కేంద్ర గ్రంథాలయం ఇన్చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ ఒ.సంపూర్ణ కాళహస్తి, కమిటీ సభ్యులు డాక్టర్ మధుర, కవి బందికట్ల నాగేశ్వరరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయ సిబ్బంది టి.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
మద్దిపాడు: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజా వైద్యం కోసం ముందు చూపుతో నిర్మించిన హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఎన్‌క్యూఏస్(నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్) పరీక్షలో మద్దిపాడు మండలంలోని అన్నంగి, ఇనమనమెళ్లూరు గ్రామాల్లో గల హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు 80 శాతం పైగా మార్కులు సాధించి సర్టిఫికెట్ పొందాయని ఆస్పత్రి డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. గతంలో బసవన్నపాలెం వెల్‌నెస్ సెంటర్‌కు ఎన్‌క్యూఏఎస్ సర్టిఫికెట్ లభించింది. జిల్లాలో ఒక పీహెచ్‌సీ పరిధిలో మూడు హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు సర్టిఫికెట్లు పొందినది మద్దిపాడు మాత్రమే కావడం విశేషం. ఈ నేపథ్యంలో వెల్‌నెస్ సెంటర్ల సిబ్బందిని పీహెచ్‌సీ డాక్టర్‌తోపాటు ఆయా గ్రామాల పెద్దలు అభినందించారు.
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని పదో వార్డులో నివాసముంటున్న బాలికను మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మద్దిపాడుకు చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సైదుబాబు బుధవారం తెలిపారు. రెండు రోజులుగా తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. బాలికకు మద్దిపాడుకు చెందిన యువకుడు మాయమాటలు చెప్పి తనతోపాటు తీసుకెళ్లినట్లు విచారణలో తేలడంతో పోక్సో కేసుగా మార్పు చేశామని వివరించారు.
● డ్రైవర్‌తోపాటు ముగ్గురికి గాయాలు
మద్దిపాడు: ముందు వెళ్తున్న గుర్తు తెలియని లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జాతీయ రహదారిపై మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు ఫ్లయ్ ఓవర్‌పై బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి మదనపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. దీంతో బస్సులో ముందు వైపు ఉన్న ముగ్గురు ప్రయాణికులతోపాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్ పోలీసులు మద్దిపాడు ఎస్సై వెంకట సూర్యకు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను ఒంగోలు జీజీహెచ్‌కి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒంగోలు వన్‌టౌన్: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 14న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కె.రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌బీఐ కార్డ్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్సు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, ష్నైడర్ ఎలక్ట్రిక్, పేటీఎం, వీక్యూరా వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్, బార్బెక్యూ నేషన్ హాస్పిటాలిటీ కంపెనీల్లో బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్, ఎంఐఎస్ లీడ్ కోఆర్డినేటర్, ట్రైనర్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, జియో పాయింట్ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీ చేసేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా ప్రారంభబవుతుందని, అభ్యర్థులకు జీతం నెలకు రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు, పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్వ్యూలకు వచ్చే వారు ఆధార్‌కార్డు, సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలతో రావాలన్నారు. పూర్తి వివరాలకు 08592 281776 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


