కర్నూలు బస్సు ప్రమాదంలో ఒంగోలు వ్యక్తి మృతి
ఒంగోలు టౌన్: కర్నూలు సమీపంలోని చిన టేకూరు వద్ద శుక్రవారం జరిగిన బస్సు దగ్ధమైన ప్రమాదంలో ఒంగోలుకు చెందిన వ్యక్తి ఒకరు మరణించారు. నగరంలోని కమ్మపాలేనికి చెందిన బొంత ఆదిశేషగిరి రావు అలియాస్ గిరిరావు (45) ఉద్యోగ నిమిత్తం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అత్తాపూర్‌లో భార్యాబిడ్డలతో కలిసి నివసిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లో మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కొద్దికాలం క్రితం ఆయన్ను పదోన్నతిపై బెంగళూరుకు బదిలీ చేశారు. దాంతో బెంగళూరులో పనిచేస్తూ వారానికి ఒకసారి హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చి పోతుంటారు. గిరిరావుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తె డిగ్రీ చదువుతుండగా, కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. దీపావళి పండుగకు ఇంటికొచ్చిన గిరిరావు గురువారం రాత్రి బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. దురదృష్టవశాత్తు బస్సు ప్రమాదంలో మరణించారు. ఒంగోలులో నివాసం ఉండే ఆయన సోదరి సమాచారం తెలిసిన వెంటనే కర్నూలు బయలుదేరారు. ప్రస్తుతం గిరిరావు మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు చేయడం పూర్తయిందని, రిపోర్టు వచ్చిన తరువాత మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
20 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం
పదోన్నతిపై బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న గిరి రావు
ఒంగోలు నుంచి కర్నూలు తరలిన కుటుంబ సభ్యులు


