మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి
నాగులుప్పలపాడు: విద్య, వైద్య రంగాలను పేద ప్రజలకు దూరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నిందని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆదివారం మండలంలోని పోతవరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 12 మాత్రమే మెడికల్ కళాశాలలు ఉండేవని తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అట్టడుగు వర్గాల బిడ్డలు కూడా వైద్యులుగా మారాలనే గొప్ప సంకల్పంతో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి కొత్తగా 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి వాటి నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చించి త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేశారన్నారు. 5 మెడికల్ కళాశాలలను తన చేతుల మీదగానే ప్రారంభోత్సవం చేయడంతో పాటు మిగతా కళాశాలలు కూడా పూర్తయ్యే దశలో ఉన్న పరిస్థితుల్లో.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పేదల ఆరోగ్యంపై విషం వెళ్లగక్కారన్నారు. పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి పేదలకు వైద్యం, వైద్య విద్యను దూరం చేస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి చంద్రబాబు దుర్మార్గాలను అర్థం చేసుకోవాలన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో రైతులు, వ్యవసాయాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, పండించిన పంటలను కొనే వారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనాన్నారు. బర్లీ పొగాకు రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుగాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల హామీలన్నీ విస్మరించి మహిళలకు తీవ్ర అన్యాయం చేశారని చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మేరుగు నాగార్జున మండిపడ్డారు. పరిపాలన గాలికొదిలేసిన చంద్రబాబు.. లేని నకిలీ మద్యం, లిక్కర్ స్కాంను బూచిగా చూపిస్తున్నారన్నారు. దీనిని ప్రజలు లోతుగా అధ్యయనం చేయాలన్నారు. అనంతరం మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు నలమలపు కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు తుమ్మల బ్రహ్మానందరెడ్డి, అన్నెం వెంకట్రామిరెడ్డి, వాకా కోటిరెడ్డి, కాట్రగడ్డ శ్రీనివాసరావు, బత్తుల ప్రసన్న, తగిరిశ సుబ్బారావు, కాటూరి ఆదియ్య, కందుల డానియేలు, పాలపర్తి ప్రవీణ్, పాదర్తి శివ, పాలేరు నాగేశ్వరరావు, కాకర్ల వెంకటేష్, గ్రామ సర్పంచ్ శీలం రేణుకా సురేష్, ఎంపీటీసీ పొద పవన్, డాకా రాజీవ్, పవన్ కుమార్, అనీల్, చిన్నం సురేష్, గోరంట్ల అంజయ్య, మాడుగుల యేసు, కాకునూళ్ల సుబ్బారావు, మారెడ్డి ఇందిర తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి


