వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు
మాట్లాడుతున్న అన్నా రాంబాబు, వేదికపై ఉడుముల శ్రీనివాసులరెడ్డి, నాయకులు
పొదిలి రూరల్: పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని, పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పొదిలి విశ్వనాథపురం (16వ వార్డు)లో పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అంగన్‌వాడీ, మహిళా కార్యదర్శి ఉడుముల వరలక్ష్మమ్మ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డితో కలిసి దివంగత సీఎం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి అన్నా రాంబాబు నివాళులర్పించారు. అనంతరం మెడికల కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో సంతకాలు సేకరించారు. పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు దూరమవుతాయన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే 500 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. వాటిలో ఇప్పటికే 7 కళాశాలల నిర్మాణాలు పూర్తి కాగా, మరో 10 కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా కళాశాలల ప్రైవేటీకరణకు ఆసక్తి చూపడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన హయంలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా స్థాపించలేకపోయారన్నారు. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూసిందన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లేవని, కూటమి ప్రభుత్వం మెడలు వంచైనాసరే పీపీపీ విధానాన్ని అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు అన్నా రాంబాబు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రారష్ట్‌ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పొదిలి, కొనకనమిట్ల మండలాల పార్టీ అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి, మోరా శంకర్‌రెడ్డి, మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, సాయిరాజేశ్వరరావు, కె.నరసింహరావు, జి.శ్రీనివాసులు, నూర్జహన్ బేగం, మెట్టు వెంకటరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, మస్తాన్‌వలి, ఫిరోజ్, వెంకటేశ్వరరెడ్డి, ఏడుకొండలు, నగర పంచాయతీ బీసీ సెల్, బూత్ వింగ్, క్రిస్టియన్ మైనార్టీ, మహిళా విభాగం, మైనార్టీ సెల్, పంచాయతీ రాజ్ వింగ్, ఆర్టీఐ వింగ్, దివ్యాంగుల విభాగం, రైతు విభాగం, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, స్టూడెంటు వింగ్, వాణిజ్య విభాగం, వలంటరీ విభాగం, యూత్ వింగ్, సోషల్ మీడియా విభాగం కమిటీల నాయకులు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసులరెడ్డి పిలుపు
పొదిలి 16వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి


