కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ
● వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: పేద ప్రజలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి కార్పొరేట్లకు దోచిపెడుతోందని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పంచాయతీలో ఐటీఐ కాలేజీ సెంటర్‌లో ఆదివారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదిమూలపు సురేష్ పాల్గొని మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య విద్యను, వైద్యాన్ని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 మెడికల్ కాలేజీలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేయించారని తెలిపారు. వాటిలో 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారని గుర్తు చేశారు. 8 వేల కోట్ల రూపాయలకుగానూ 3 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, మిగిలిన 5 వేల కోట్ల రూపాయలతో కాలేజీలు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మిగిలిన 10 మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా నిధుల కొరతను సాకుగా చూపి పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతోందన్నారు. జగనన్న మెడికల్ కాలేజీలను మంజూరు చేయించటంతో పాటు నిధు లు సమకూర్చి అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి స్థల సేకరణ జరిపి కాలేజీల నిర్మాణానికి నిధులు ఖర్చు చేయగా, వాటి నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని అప్పనంగా కార్పొరేట్లకు అప్పగించేందుకు కంకణం కట్టుకుందని ఆదిమూలపు సురేష్ దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండుకు చెందిన నాలుగు ఎకరాల భూమిని సంవత్సరానికి ఒక్క రూపాయికి కూటమి ప్రభుత్వం లీజుకిస్తోందని, కార్పొరేట్లకు దోచిపెడుతోందని మండిపడ్డారు. అనంతరం ఇంటింటికి తిరిగి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మిరియం సుధాకర్, ఎంపీటీసీ అంబటి ప్రసాద్, మాలె ప్రకాష్‌రెడ్డి, మాలె రంగారెడ్డి, చుక్కా కిరణ్‌కుమార్, దాసు శ్రీను, గాదంశెట్టి గుప్తా, షేక్ బషీర్, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, పోలుబోయిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, ఎస్.కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అంకయ్య, పఠాన్‌రియాజ్, చొప్పర వెంకన్న, రాపూరి ప్రభావతి, షేక్ మహమ్మద్‌బాషా, గొల్లపోతు గోవర్దన్, పాకనాటి రమణారెడ్డి, షేక్ కరీం, సాయికోటి, వాయిల పున్నయ్య, బుజ్జమ్మ, షేక్ అల్లాఉద్దీన్, షేక్ అల్లాభక్షు, పి.శ్రీనివాసులరెడ్డి, సీహెచ్ కృష్ణారెడ్డి, పెరికాల సునీల్, షేక్ అల్లా, కేశవరపు శ్రీనివాసులరెడ్డి, షేక్ రహీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ


