రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
గిద్దలూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట గ్రామ సమీపంలో నల్లమల ఘాట్ రోడ్డుపై శనివారం వేకువజామున జరిగింది. ఆళ్లగడ్డ నుంచి రాజమండ్రికి మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తూ నల్లమల ఘాట్ రోడ్డు మలుపు వద్ద పాత రైల్వేబ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ దూదేకుల బాలహుస్సేన్ (50) క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ చిన్నయ్యకు స్వల్పగాయాలయ్యాయి. రోడ్డుకు అడ్డంగా లారీ ఉండిపోవడంతో నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వెళ్లే వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయాయి. దీంతో సుమారు 6 గంటల పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రయాణికులు బస్సులు, ఆటోల నుంచి దిగి నడుచుకుంటూ గిద్దలూరు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని క్రెయిన్ సహాయంతో పక్కకు తొలగించారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తిగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే ప్రాంతంలో ఈ నెల 16వ తేదీ లారీ ఢీకొని డ్రైవర్ రాజు మృతి చెందాడు. పాత రైల్వే బ్రిడ్జి వద్ద గల మలుపు ప్రమాదకరంగా ఉందని, దానిని గుర్తించి వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సీఐ కె.సురేష్ సూచించారు.
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి


