బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
కురిచేడు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో బృహత్తర ఆశయంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయిస్తే..చంద్రబాబు వాటిని తన బినామీలకు కట్టబెట్టేందుకు ప్రైవేటీకరణ జపం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో శనివారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు పార్టీ మండల కన్వీనర్ వైవీ సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ కల్లబొల్లి హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు రాకూడదనే కుట్రలో భాగంగానే మెడికల్ కళాశాలలను ప్రైవేట్ చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే వైద్య, విద్యతో పాటు వైద్య సేవలు కూడా అందని ద్రాక్షపండులా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి 25 ఏళ్లు పడుతుందని పెయిడ్ ఆర్టిస్టులతో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 కళాశాలలు మంజూరు చేయించి వాటిలో 7 కళాశాలలను మూడేళ్లలో పూర్తి చేసి వాటిని ప్రారంభించి పేదలకు వైద్య సేవలందించారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామీణ ప్రాంతానికి కూడా స్పెషలిస్టు డాక్టర్లు వచ్చి పేదలకు ఉచితంగా వైద్య సేవలందించారని గుర్తు చేశారు. కానీ మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికే మద్యం, ఇసుక పూర్తిగా కూటమి చేతుల్లోకి వెళ్లిపోయాయని, ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు వారి బంధువులకు కట్టబెట్టినా పేదలకు నష్టం లేదని, కానీ పేదల ప్రాథమిక హక్కు అయిన విద్య, వైద్యం వారికి దూరం చేయాలని చూస్తుంటే పోరాటం చేస్తున్నామన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది ప్రాణాలు కాపాడిందని, కానీ ఆ పథకం కూడా కూటమి ప్రభుత్వంలో అటకెక్కిందన్నారు. భావితరాల అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో స్వచ్ఛందంగా చేయి కలపాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ టీయూసి రాష్ట్ర కార్యదర్శి షేక్.సైదా, జిల్లా అధికార ప్రతినిది గోగులముడి లింగారెడ్డి, వి.కోటయ్య, ఎం సుబ్బారెడ్డి, ఎన్ రాజయ్య, ఇందూరి పద్మ, షేక్.మౌలాలి, వరికూటి వెంకటేశ్వర్లు, పి.వెంకట్రావు, కె.జోసఫ్, ఊట్ల వెంకటేశ్వర్లు, అంకే గోపాలకృష్ణ, సారెడ్డి నాగిరెడ్డి, బల్లిపల్లి సుబ్బారావు కానాల శివారెడ్డి, ఎం నాగమణి, ఎం యోగిరెడ్డి, అంకే వెంకటేశ్వర్లు, కె.నాగేశ్వరరావు, గొట్టిపాటి రాములు, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, పీవీ సుబ్బారావు, ఇందూరి సుబ్బారెడ్డి, సర్పంచ్‌లు కె.కృష్ణయ్య, కె.భాస్కరరెడ్డి, నాయకులు ఎన్ ప్రతాపరెడ్డి, ఎం. పిచ్చిరెడ్డి, రమణారెడ్డి, ఏ చెన్నారెడ్డి, జి.సంతారావు, పుల్లారెడ్డి, సాదం నాసరయ్య, ఎన్వీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


