
నిరుద్యోగుల గొంతుకోసిన చంద్రబాబు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నమ్మించి గొంతుకోశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో గురువారం అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోజ్జాడ యుగంధర్ అధ్యక్షత వహించగా, ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సృష్టిస్తానని, లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మొత్తం 143 హామీలిచ్చిన చంద్రబాబు తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడి యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తానని, వర్క్ ఫ్రం హోం ద్వారా ఇంటి దగ్గర కూర్చుని లక్షలు సంపాదించేలా చేస్తానని చంద్రబాబు మాట్లాడారని చెప్పారు. 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పారని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినప్పటికీ ఈ ఏడాదికి రావాల్సిన 4 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఐటీ హబ్‌లు పెడతాను, ఇండస్ట్రియల్ కారిడార్లు పెడతానని ఒట్టి మాటలు చెప్పడం తప్ప ఆచరణలో ఒక్క జిల్లాలో కూడా ఎలాంటి పరిశ్రమలు పెట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితులతో పాటు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ యువత దగ్గరకు ఏఐవైఎఫ్ వెళ్తోందని చెప్పారు. యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి లేని వారి సంఖ్య 2.50 కోట్లకుపైగానే ఉన్నట్లు స్కిల్ సర్వేలో తేలిందని తెలిపారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిలో కోటిన్నర మంది ఎలాంటి ఉపాధి లేని వారు ఉన్నారని చెప్పారు. కూటమి పాలనలో యువతకు దక్కిందేమీ లేదన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖలలో సుమారు 3.20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్పప్పటీకీ వాటిని భర్తీ చేసే పరిస్థితి కానరావడం లేదన్నారు. నిరుద్యోగ యువత పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆఫీస్ బేరర్లు పోతుల ప్రభాకర్, వై.బాబి, కత్తి రవి, షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు.