
ధరపై దిగాలు.. రైతుల గగ్గోలు
పొగాకుకు గిట్టుబాటు ధరలు లేక, పెట్టుబడి చేతికిరాక నష్టాలపాలు
కంభం:
పొగాకు రైతులను కష్టాలు, నష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలో పొగాకు అధికంగా పండించే గ్రామాల్లో ఒకటిగా ఉన్న కంభం మండలం జంగంగుంట్లలో రైతులు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గ్రామంలో రైతులు 50 ఏళ్లకు పైగా వంశపారపర్యంగా పొగాకు సాగు చేస్తున్నారు. ఇక్కడ నీటి సౌకర్యం తక్కువ ఉండటం, బోర్లు వేసినా నీరు పడక పోవడంతో వాణిజ్య పంట పొగాకు వైపు మొగ్గుచూపారు. సుమారు 400 మంది రైతులు వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పొగాకు సాగు చేస్తున్నారు. గ్రామంలో సుమారు 100 వరకు బ్యారన్‌లు ఉన్నాయి. జంగంగుంట్లతో పాటు పరిసర గ్రామాల్లోనూ సుమారు 1500 ఎకరాల వరకు పొగాకు సాగు చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారడం, గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారుల సిండికేట్‌తో నష్టం
వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి కొన్ని బేళ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, తిరస్కరించిన బేళ్లను ఇళ్లలో నిల్వ ఉంచుకోవాలంటే ఇబ్బందిగా ఉందని రైతులు వాపొతున్నారు. ఎండకు, వానకు పొగాకు నాణ్యత తగ్గిపోతుండటంతో మళ్లీ గ్రేడింగ్ చేసుకోవడం అదనపు భారంగా మారుతోందని చెబుతున్నారు. గతంలో నోబిడ్ అయిన, తిరస్కరించిన బేళ్లను అక్కడే గోడౌన్‌లో పెట్టుకునేవారు. ప్రస్తుతం పొగాకు ఎక్కువగా ఉందని అధికారులు నిరాకరిస్తుండటంతో తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు నానాతిప్పలు పడుతున్నారు.
వైఎస్సార్, జగన్ హయాంలోనే లబ్ధి
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్‌టీసీ ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయించడమే కాకుండా ఎఫ్–8, ఎఫ్–9 రకం రైతులకు క్వింటాకు రూ.2 వేల చొప్పున డబ్బు ఇచ్చి నాడు ప్రభుత్వం ద్వారా ఆదుకున్నారన్నారని జంగంగుంట్ల రైతులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంతో లాభపడ్డామని, గడిచిన నాలుగేళ్లలో ఎఫ్–1 నుంచి ఎఫ్–4 రకం వరకు క్వింటా రూ.36 వేల వరకు ధర పలకగా, మిగిలిన రకాలకు రూ.30 వేల వరకు ధర లభించిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3 రకాలు రూ.28 వేలు ఉండగా ఎఫ్4 రూ.18 వేలు పలుకుతోందని, లోగ్రేడ్ రకం, పచ్చాకును అసలు కొనడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్ని రకాల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పొగాకు రైతులను ప్రభుత్వం
ఆదుకోవాలి
గత ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులకు ఏనాడూ నష్టాలు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పొగాకు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. గిట్టుబాటు ధరలు కల్పించి, అన్ని రకాల గ్రేడ్ల పొగాకును కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుని, పొగాకు రైతులను ఆదుకోవాలి.
– గొంగటి చెన్నారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, కంభం

ధరపై దిగాలు.. రైతుల గగ్గోలు