
వంట పని.. పాచి పని విద్యార్థులతోనే..
పుల్లలచెరువు మండలంలోని మురికిమళ్లలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాఠశాలలో రక్షిత మంచినీరు లేక పోవడంతో ఓవర్ హెడ్ ట్యాంక్‌లో నిల్వ ఉన్న నీటిని తాగుతున్నారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు వివిధ ప్రాంతాలకు చెందిన 162 మంది గిరిజన బాలికలు ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 21 మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధించాల్సి ఉంది. కానీ ఇక్కడ 8 మంది ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలోనూ ఒకరిద్దరు నిత్యం సెలవులో ఉంటారని విద్యార్థులు చెబుతున్నారు. యర్రగొండపాలెం–మాచర్ల రహదారి సమీపంలో ఉన్న ఈ పాఠశాల పరిస్థితి ఇలా ఉందంటే.. ఇక రాకపోకలకు సరైన మార్గం లేని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలల నిర్వహణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మురికిమళ్ల ఆశ్రమ పాఠశాలలో రెండు రోజుల క్రితం వరకు కేవలం ఇద్దరు మాత్రమే వర్కర్లు ఉండేవారు. వీరు వంట, పారిశుధ్య పనులు నిర్వహించాల్సి ఉంది. వర్కర్లు తక్కువగా ఉండటంతో అన్ని పనులు బాలికలతోనే చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థినులు విడతల వారీగా వంట పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు. గత ఆదివారం తమ పిల్లలతోనే చపాతీలు చేయించారని, పారిశుధ్య పనులకు కూడా పిల్లలనే వాడుతున్నారని తల్లిదండ్రులు పేర్కొనడం పాఠశాలలో పరిస్థితికి అద్దం పడుతోంది. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తాము శుభ్రంగా ఉంటామని, అలాంటి పరిస్థితి ఆశ్రమ పాఠశాలల్లో కనిపించడం లేదని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.

వంట పని.. పాచి పని విద్యార్థులతోనే..