
జీతం పెంచే వరకు సమ్మె ఆపేది లేదు
ఒంగోలు సబర్బన్: తమకు జీతం పెంచేంత వరకు సమ్మె ఆపేది లేదని ఒంగోలు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు తెగేసి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తొలుత కార్మికులు కార్యాలయం ముందు రోడ్డులో మానవహారంగా ఏర్పడ్డారు. సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు, యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నేపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జీవో, సమ్మె కాలపు ఒప్పందాల జీవో ఇచ్చేంత వరకు నగరంలో సమ్మె కొనసాగుతుందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న మున్సిపల్ ఇంజినీరింగ్ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడేళ్ల నుంచి జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజినీరింగ్‌లో పనిచేస్తున్న కార్మికులకు రూ.21 వేల జీతం, స్కిల్ వర్కర్‌కు రూ.24 వేల జీతం ఇవ్వాలని గత సమ్మెలో ఒప్పందం చేసుకున్న సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించకుంటే పట్టణాలు, నగరాలు కంపుకొడతాయని, మున్సిపల్ యూనియన్ పోరాటానికి ఇతర ప్రజా సంఘాలు కూడగట్టుకొని ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ట్రేడ్ యూనియన్స్‌ను కలుపుకొని ప్రభుత్వం మెడలు వంచి కార్మిక వర్గం సాధించుకున్న విజయాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. మున్సిపల్ పోరాటానికి మద్దతుగా పెన్సర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు పాల్గొని కార్మికులకు మద్దతు పలికారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సామ్రాజ్యం, యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు జి.నరసింహ, టి.విజయమ్మ, జాలయ్య, శంకర్, శివమ్మ, శ్రీదేవి, ఆర్.శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వర్లు, కె.మోహన్‌రావు, భారతి, వంశి, బి.బాబు, ఎం.బాబు, జేమ్స్, అనిత, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
ఇంజినీరింగ్, పారిశుధ్య కార్మికుల నిరసన