
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రాచర్ల: మండలంలోని ఎడవల్లి క్రాస్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. మండలంలోని గుండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన నల్లబోతుల వెంకటయ్య (74) గుండ్రెడ్డిపల్లె నుంచి గిద్దలూరు వైపుగా వస్తున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నల్లగుంట్ల హత్య కేసులో నిందితులకు బేడీలు
● కేసు వివరాలు వెల్లడించిన సీఐ ప్రభాకర్‌రావు
పెద్దదోర్నాల: మండల పరిధిలోని నల్లగుంట్లలో గత నెల 4వ తేదీన జరిగిన బైరబోయిన వెంకటేశ్వర్లు హత్య కేసులో నిందితులకు పోలీసులు బేడీలు వేశారు. వారిని శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. సీఐ ప్రభాకర్‌రావు, ఎస్సై మహేష్ కథనం ప్రకారం.. తన భర్త హత్యకు గురయ్యాడని బైరబోయిన వెంకటేశ్వర్లు భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు మొద్దు తిరుపతిరావు, భైరబోయిన బాల తిరుమలయ్య, మొద్దు వెంకటేశ్వర్లు, మొద్దు రాంకుమార్‌లతో పాటు మరో మైనర్ బాలుడిని గుర్తించి అరెస్టు చేశారు. హతుడు వెంకటేశ్వర్లు 2022వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన మొదటి నిందితుడు సోదరుడైన మొద్దు వెంకటేశ్వర్లును కొర్రప్రోలు వద్ద నరికి చంపాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న సదరు నిందితులు పథకం ప్రకారం గత నెల 4వ తేదీన నల్లగుంట్లలో పీర్ల పండగ జరుగుతున్న సమయంలో పీర్లకు మొక్కుతున్న భైరబోయిన వెంకటేశ్వర్లును కత్తులతో దాడి చేసి చంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మండల పరిధిలోని కొర్రప్రోలు వద్ద ఉన్నట్లు తెలుకుని అక్కడికి వెళ్లారు. నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టినట్లు సీఐ ప్రభాకరరావు తెలిపారు.
కరుణించిన వరుణుడు!
ఒంగోలు సబర్బన్: వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి.. పంటలు మొలకదశలోనే వాడు ముఖం పడుతుండటంతో దిగాలు చెందిన రైతులకు వానదేవుడు కాస్త ఊరటనిచ్చాడు. జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి మొదలుకొని శుక్రవారం తెల్లవారే వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా యర్రగొండపాలెంలో 122.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పామూరు మండలంలో 5.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. టంగుటూరు మండలంలో 88 మిల్లీమీటర్లు, కొత్తపట్నం 77.4, మద్దిపాడు 70.2, జరుగుమల్లి 68.4, తాళ్లూరు 59.8, దర్శి 54.6, సంతనూతలపాడు 52.6, తర్లుపాడు 49.8, పుల్లలచెరువు 49.4, బేస్తవారిపేట 46.4, రాచర్ల 46.2, దొనకొండ 43.6, పెద్దారవీడు 42.8, చీమకుర్తి 40, సింగరాయకొండ 39.4, మార్కాపురం 36.2, పొన్నలూరు 32.4, నాగులుప్పల పాడు 30.2, గిద్దలూరు 26.8, కొండపి 21.4, పెదచెర్లోపల్లి 21.2, అర్ధవీడు 20.2, పొదిలి 19.6, కంభం 19.4, దోర్నాల 18.6, మర్రిపూడి 18.6, కొమరోలు 17.2, కనిగిరి 16.6, కొనకనమిట్ల 15.6, కురిచేడు 15, ముండ్లమూరు 14.2, హనుమంతునిపాడు 11.2, ఒంగోలు రూరల్ 10.2, ఒంగోలు అర్బన్ 10.2, వెలిగండ్ల 8, సీఎస్‌పురం 7, త్రిపురాంతకం మండలంలో 6.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
భారీ వర్షానికి కూలిన పొగాకు బ్యారన్
టంగుటూరు: భారీ వర్షానికి పొగాకు బ్యారన్ కూలింది. ఈ సంఘటన మండలంలోని జమ్ములపాలెంలో శుక్రువారం రాత్రి జరిగింది. బాధిత రైతు నరగర్ల కొండయ్య కథనం ప్రకారం.. భారీ గాలి, ఉరుములు, మెరుపులు, వర్షం ధాటికి ఒక్కసారిగా బ్యారన్ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై బోర్డు అధికారులకు సమాచారం అందించానని స్పష్టం చేశాడు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి